- గోషామహల్ పోలీస్ స్టేడియాన్ని పరిశీలించిన డిజిపి సి. వి. ఆనంద్
- సభావేదిక, రాకపోకలు, పార్కింగ్‌పై సమీక్ష
- పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించేలా ఏర్పాట్లు
- నిర్మాణ పనుల్లో జాప్యంపై వద్దు
- వచ్చే ఏడాది అక్టోబరుకల్లా పనులన్నీ పూర్తి చేయాలి : డిజిపి
హైదరాబాద్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డిజిపి సి. వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 21న గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సంబంధించి సోమవారం స్టేడియాన్ని పరిశీలించి న ఆయన పలు ఏర్పాట్లపై సమీక్షించారు.
సభా వేదిక నిర్మాణం, ప్రముఖుల రాకపోకలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జన సమూహాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గాలను స్పష్టంగా గుర్తించాలని, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
స్టేడియంలో కొనసాగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని డిజిపి సమీక్షించారు. 48 గుర్రాలకు వసతి కల్పించే ఆధునిక అశ్వశాల సముదాయం, పోలీసు జాగిలాల కెన్నెల్స్, ఐదు అంతస్తుల సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) భవనం, క్రీడా మైదానాలు, అథ్లెటిక్స్ సదుపాయాల నిర్మాణాలను పరిశీలించారు.
పనుల్లో జరుగుతున్న జాప్యంపై చేయవద్దన్నారు. అధికారులు, ఇంజినీర్లు సమన్వయంతో పనిచేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు నాటికి స్టేడియం సముదాయాన్ని అన్ని సదుపాయాలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని గౌరవప్రదంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు డిజిపి ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు.



