న్యూఢిల్లీ:
అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని మరికొన్నేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగించేందుకు బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, పథకానికి మరింత విస్తృత ప్రచారం కల్పించడం, అలాగే మౌలిక వసతులు మరియు నిర్వహణలో అభివృద్ధికి అదనపు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 జనవరి 19 నాటికి అటల్ పెన్షన్ యోజనలో 8.66 కోట్ల మంది చందాదారులుగా చేరడం విశేషం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, చిన్న వ్యాపారులు, కూలీలు ఈ పథకాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఏమిటీ అటల్ పెన్షన్ యోజన?
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అలాంటి భద్రత ఉండదు. ఈ లోటును పూరించేందుకే కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత సభ్యులకు నెలకు కనీసం రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు హామీ పెన్షన్ అందుతుంది.
అర్హతలు
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పథకంలో చేరవచ్చు. సభ్యులు తమ వయస్సు, ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి నెలనెలా కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది.
పథకంలో చేరాలంటే తప్పనిసరిగా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పరిధిలో ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లించే వారు ఏపీవైలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు కారు.
18 ఏళ్ల వయసులో చేరినవారు నెలకు రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చందా చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయసులో చేరితే 20 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉండగా, నెలవారీ చందా రూ.291 నుంచి రూ.1,454 వరకు ఉంటుంది.
ఆటో డెబిట్ సౌకర్యం
ఈ పథకంలో చేరిన సభ్యులు తమ బ్యాంకు ఖాతాను కాంట్రిబ్యూషన్ ఖాతాతో లింక్ చేసి నెలవారీ చందాను నేరుగా ఆటో డెబిట్ ద్వారా చెల్లించే సౌకర్యం ఉంది. ఇందుకోసం ప్రతి నెల ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అటల్ పెన్షన్ యోజనను 2030–31 వరకు కొనసాగించడం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరింత బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


