Saturday, October 24, 2026
Google search engine
Homeతెలంగాణఅసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు

అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు

  • హమాలీ, డొమెస్టిక్ వర్కర్స్‌ కోసం త్వరలో ఏర్పాటు
  • కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలం
  • పరిశ్రమల అభివృద్ధి–కార్మికుల సంక్షేమం రెండూ ముఖ్యం
  • శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి

హైదరాబాద్‌

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. హమాలీ, డొమెస్టిక్ వర్కర్స్‌ కోసం వేర్వేరుగా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల సంక్షేమానికి చట్టపరమైన చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నిబంధనలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో “సోషల్‌ డెమోక్రసీ, పొలిటికల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌: రీబిల్డింగ్‌ ది ఆర్కిటెక్చర్‌ ఆఫ్‌ సోషల్‌ డైలాగ్‌” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, కార్మికుల హక్కులను పరిరక్షించడం, భవిష్యత్తులో పని విధానాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కార్మిక రంగాన్ని సిద్ధం చేయడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.

దేశంలోని సుమారు 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. సంఘటిత రంగ కార్మికులకు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం పోరాడే అవకాశం ఉందని, అసంఘటిత రంగ కార్మికులకు ఆ స్థాయిలో ప్రాతినిధ్యం, రక్షణ లేదని అన్నారు. ఈ రంగంలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి మరిన్ని చర్చలు, విధానపరమైన చర్యలు అవసరమన్నారు.

తన తండ్రి గడ్డం వెంకటస్వామి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని గుర్తుచేశారు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టే సమయంలో పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా, కార్మికుల ప్రయోజనాల కోసం ఆయన అండగా నిలిచారని తెలిపారు.

గిగ్‌ వర్కర్ల హక్కుల పరిరక్షణకు రాహుల్‌ గాంధీ చేపట్టిన చొరవను మంత్రి ప్రస్తావించారు. రాహుల్ గాంధీ చొరవతోనే తెలంగాణలో గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం చట్టాన్ని తీసుకొచ్చామని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంబంధిత నిబంధనలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

హమాలీ కార్మికులు, డొమెస్టిక్ వర్కర్స్‌ కోసం వేర్వేరు సంక్షేమ బోర్డుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల హక్కులు, సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.

తెలంగాణలో గత పదేళ్లుగా కనీస వేతనాలను ప్రకటించలేదని, తాను కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత కనీస వేతనాలను ప్రకటించామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి, కార్మికులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కార్మికులకు తగిన వేతనాలు, గౌరవప్రదమైన జీవనం అందినప్పుడే ఉత్పాదకత పెరుగుతుందని, పరిశ్రమల్లో పారిశ్రామిక శాంతి నెలకొంటుందని వివరించారు. పరిశ్రమలు, కార్మికులు పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కార్మికుల భద్రతను విస్మరించరాదని మంత్రి అన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఫ్యాక్టరీల తనిఖీల సందర్భంగా అధికారులు సూచించిన భద్రతా చర్యలను యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.

తనిఖీ నివేదికలను కంపెనీల బోర్డు సమావేశాల్లో చర్చించి, భద్రతా లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు తమ బాధ్యతలను గుర్తించి కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు నైపుణ్యాభివృద్ధి కీలకమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేస్తున్నామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

రక్షణ, ఏరోస్పేస్‌ తదితర రంగాల్లో వస్తున్న కొత్త పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యమన్నారు. ఐటీఐ విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైపెండ్‌ అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతకు జర్మన్‌ భాషలో శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జర్మనీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు అవకాశాలు ఉన్నాయని, అక్కడి సంస్థలతో చర్చల సందర్భంగా సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావన వచ్చిందని చెప్పారు.

తన నియోజకవర్గంలోని మందమర్రిలో 70 మంది యువతకు జర్మన్‌ భాషలో శిక్షణ అందిస్తున్నామని, వారికి తన సంస్థ తరఫున స్టైపెండ్‌ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు జర్మనీలో ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. యూరప్‌, జపాన్‌ తదితర దేశాల్లో మారుతున్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా స్థానిక భాషలు, ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ పొందడం అవసరమన్నారు.

విధాన నిర్ణయాల్లో కార్మికులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. బలమైన ట్రేడ్‌ యూనియన్లు, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వం, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, అర్థవంతమైన సామాజిక సంభాషణ ద్వారా న్యాయబద్ధమైన, సమ్మిళిత సమాజాన్ని నిర్మించవచ్చన్నారు.

కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ ప్రతినిధులు, నిపుణులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్మిక సంస్కరణలు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడటంతో పాటు కార్మికుల హక్కులను పరిరక్షించేలా ఉండాలని చెప్పారు. సదస్సులో వచ్చే ఆచరణాత్మక సూచనలను పరిశీలించి, కార్మికుల ప్రయోజనాలకు అనుగుణంగా సాధ్యమైన మేరకు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, మాజీ ఎంపీ ఖుంతియా , తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌‌తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments