అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ఆయన చేసిన హనుమంతుడికి సంబంధించిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని రాష్ట్రీయ వానరసేన సభ్యులు ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనకు మూలం ఇటీవల నిర్వహించిన ‘వారణాసి’ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్. మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తి, కార్యక్రమం కొన్ని నిమిషాలు నిలిచిపోయింది. దీనితో భావోద్వేగానికి లోనైన రాజమౌళి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ దేవుడి మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
‘‘మా నాన్న నాతో ‘హనుమంతుడు వెనకుండి నిన్ను నడిపిస్తున్నాడు’ అని చెప్పగా, నాకు కోపం వచ్చింది. నా భార్యకు హనుమంతుడంటే చాలా ప్రేమ. ఆయనను స్నేహితుడిలా భావిస్తుంది. ఆ సమయంలో జరిగిన సాంకేతిక సమస్యను చూసి ఆమె మీద కూడా కోపం వచ్చింది’’ అంటూ రాజమౌళి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలు హిందూ భావజాలాన్ని అవమానించాయని, ప్రముఖ ప్రజా వ్యక్తిగా రాజమౌళి మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హిందూ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
సోషల్ మీడియాలో మాత్రం రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత భావాలు మాత్రమేనని సమర్థిస్తుండగా, మరికొందరు అవి మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ వివాదం సినిమా ప్రచారంపై ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


