కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి మార్పు జోరందుకున్న సమయంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర క్యాబినెట్లో కీలక నేత సతీశ్ జార్కిహోళితో రహస్యంగా సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. సీఎం సిద్ధరామయ్యకు రాజకీయ వారసుడిగా, ‘అహింద’ వర్గాలకు బలమైన నేతగా గుర్తింపు పొందిన జార్కిహోళితో డీకేఎస్ భేటీ కావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్య తరవాత పార్టీని నడిపే వ్యూహాలు, ఇద్దరి మధ్య ఉన్న విభేదాల పరిష్కారం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. గతంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా, తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించగల నేతగా జార్కిహోళిని బహిరంగంగానే ప్రస్తావించారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్ చేతికప్పించాలని ఆయన మద్దతుదారులు ఢిల్లీలో లాబీయింగ్ వేగవంతం చేశారు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేను కలిసి, డీకేఎస్ను త్వరలోనే సీఎం చేయాలని డిమాండ్ చేశారు. డీకేఎస్ “200 శాతం సీఎం అవుతారు” అని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో హోంమంత్రి జి.పరమేశ్వర కూడా సీఎం రేసులో తాను ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఇటీవల జార్కిహోళి నివాసంలో దళిత నేతలతో కలిసి విందులో పాల్గొన్నామని, అక్కడ రాజకీయ చర్చలు కూడా జరిగాయని ఆయన వెల్లడించారు. అన్ని వైపులా చర్చలు, సమీకరణాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం సిద్ధరామయ్య మాత్రం ఇది అనవసర చర్చ అంటూ కొట్టిపారేశారు. అయితే సీఎం మార్పుపై తుది నిర్ణయం తీసుకునేది అధిష్ఠానమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేయడంతో ఈ రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
కర్ణాటక కాంగ్రెస్లో సీఎం మార్పు ఊహాగానాలు బలపడ్డాయి – డీకే శివకుమార్ రహస్య భేటీతో కొత్త చర్చలు
RELATED ARTICLES


