జాతీయ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే..
ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ..
అవార్డుల్లో చోటు దక్కించుకున్న బాలయ్య బాబు భగవంత్ కేసరి..
కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ’12th ఫెయిల్’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. జాతీయ ఉత్తమనటుడు అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఇక, నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కండీలు’, జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్’ ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘కథల్’ ఎంపికైంది. ఇక, జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో ‘హనుమాన్’ అవార్డుకు ఎంపికైంది.
జాతీయ ఉత్తమ సినీ గీతంగా తెలుగు పాట ఎంపికవడం విశేషం. బలగం సినిమాలోని ‘ఉరు-పల్లెటూరు’ అంటూ సాగే పాటకు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ అవార్డుకు ఎంపికయ్యారు.
జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్ ఎంపికయ్యారు. సూపర్ హిట్టయిన ‘బేబీ’ చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. అంతేకాదు, ‘బేబీ’ చిత్రానికి గాను పీవీఎన్ఎస్ రోహిత్ జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు.