రంగారెడ్డి
డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను అరికట్టి, పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహానగర పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గురువారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, ఉప్పల్, మహేశ్వరం, అంబర్ పేట నియోజకవర్గాల శాసనసభ్యులు తమ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
నిజమైన పేదలకు కాకుండా మంత్రులు, అధికారుల సిఫార్సుల ఆధారంగా ఎలాంటి లాటరీ పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్న విషయాన్ని ఆధారాలతో చూపించారు. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీల ఎంపిక ప్రక్రియను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇష్టారాజ్యానికి వదిలివేయడం ద్వారా నిజమైన పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
నిజమైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అక్రమార్కులకు అడ్డదారిలో కేటాయిస్తే సహించేది లేదని, గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ఎల్బీనగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కె.పి. వివేకానంద, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


