హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు..
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు..
ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న జల వివాదాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం లోపు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ భేటీని ఇరు రాష్ట్రాల సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా అభివర్ణించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగాయని తెలిపారు. కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్‌లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనల్లోని సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జల సమస్యల పరిష్కారానికి ఒక శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. ఇరు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఒప్పందానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.