స్టాలిన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్
తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంలో డీఎంకే ప్రభుత్వం ఊహించని న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే పూర్తి హక్కు ఉందని స్పష్టం చేసింది.
జస్టిస్ జీ. జయచంద్రన్, జస్టిస్ కేకే. రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అల్లర్లు జరుగుతాయన్న ఊహాజనిత కారణాలతో సంప్రదాయ ఆచారాలను అడ్డుకోవడం సరికాదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.
“శాంతిభద్రతల పేరిట ఆచారాలకు అడ్డుకట్ట వేయలేరు”
కార్తీక దీపం వెలిగించే సమయంలో భక్తులకు పరిమితంగానే అనుమతి ఉంటుందని, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. అలాగే, పురావస్తు శాఖ నుంచి అనుమతులు తీసుకుని సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించవచ్చని పేర్కొంది.
తిరుపరంకుండ్రం నేపథ్యం
మధురై సమీపంలో ఉన్న తిరుపరంకుండ్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భావిస్తారు. శతాబ్దాలుగా కార్తీక మాసంలో ఈ కొండపై దీపం వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే, అదే కొండపై సికందర్ బాదుషా దర్గా ఉండటంతో, కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందిందని పేర్కొంటూ హిందువులు దీపం వెలిగించకూడదని దర్గా కమిటీ అభ్యంతరం తెలిపింది.
ఈ వివాదం న్యాయస్థానానికి చేరడంతో, మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సింగిల్ బెంచ్ హిందువుల పక్షాన తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఆ తీర్పును అమలు చేయకుండా, స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు
తాజా తీర్పుతో సింగిల్ బెంచ్ నిర్ణయం యథాతథంగా అమల్లో ఉంటుందని, ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదని డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఈ తీర్పును హిందూ సంఘాలు స్వాగతించగా, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.


