అన్య మతస్తులను ఉద్యోగులుగా ఎలా ఉండనిస్తున్నారు..
చర్చి, మసీదుల్లో హిందువులకు కొలువులు ఇస్తున్నారా..?
హిందూ ఆచారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి..
ఇప్పటికైనా టీటీడీ స్పందించాలి అంటున్న బండి సంజయ్..
తిరుమల తిరుపతి దేవస్థానంపై కరీంనగర్(తెలంగాణ) బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. అలాంటి వాళ్లను కొనసాగిస్తుండడం ఏంటి?. చర్చి, మసీదుల్లో హిందువులకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తున్నారా?..
అన్యమతస్తులైన ఉద్యోగుల వల్ల హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?. అలాంటి వాళ్లు ఉన్నారని బయటకు వస్తేనే సస్పెండ్ చేస్తారా?. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు… ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలి’’ అని బండి సంజయ్ టీటీడీని డిమాండ్ చేశారు.
అదే సమయంలో.. తెలుగు రాష్ట్రాల్లో దూపదీప నైవేద్య నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని స్పష్టం చేశారాయన. అనేక చారిత్రక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలి. కరీంనగర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్నా అని బండి సంజయ్ అన్నారు.