రంగారెడ్డి జిల్లాలో అధికారుల అండదండలతోనే కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు
రంగారెడ్డి జిల్లా:
మైనింగ్ గడువు ముగిసినప్పటికీ, ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నమ్యశ్రీ సంస్థ అక్రమ మైనింగ్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ జస్టిస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఆ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
*గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు
హయత్ నగర్ ప్రాంతంలో నమ్యశ్రీ బిల్డర్స్ మరియు వెంచర్స్ సంస్థ చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అనుమతుల గడువు గడచిన జూన్ నెలలోనే పూర్తిగా ముగిసింది. చట్టప్రకారం గడువు ముగిసిన వెంటనే తవ్వకాలను నిలిపివేయాల్సి ఉండగా, యాజమాన్యం ఏమాత్రం లెక్కచేయకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ను కొనసాగిస్తోంది. పర్యావరణ చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ నిరంతరంగా వనరులను దోచుకుంటున్నట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.
*అధికారుల అక్రమ కుమ్మక్కు
స్థానిక తహశీల్దార్, పోలీసు శాఖ అధికారులు మరియు రంగారెడ్డి జిల్లా మైనింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, వారి ఉదాసీన వైఖరి వల్లే ఈ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయని సోషల్ జస్టిస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులే స్వయంగా నమ్యశ్రీ యాజమాన్యంతో కుమ్మక్కై, లంచాలకు అలవాటుపడి అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై కూడా శాఖాపరమైన విచారణ జరిపి తక్షణ శిక్షా చర్యలు తీసుకోవాలని కోరారు.
గడువు తీరిన మైనింగ్‌పై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి, తవ్వకాలను నిలిపివేసి, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు ఈ అంశంపై స్పందించడంలో విఫలమైతే, ప్రజా చైతన్యంతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


