ఇదే తరహాలో దిల్ సుఖ్ నగర్ లో కూడా చోరీ
ఎల్బీనగర్
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్డులో గల ఆశాపుర పాన్ బ్రోకర్ & జ్యువెలర్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఈ దుకాణాన్ని మహేంద్ర సింగ్ గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న లావెండర్ బ్యూటీ పార్లర్కు ఆనుకుని ఉన్న దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి నిందితులు లోపలికి ప్రవేశించారు. అయితే, నిందితులు ఎలాంటి వస్తువులను అపహరించకపోవడంతో ఆస్తి నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఏసీపీ బి. రవీందర్ రెడ్డి, క్లూస్ టీమ్, సీసీఎస్ ఎల్బీనగర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ నాలుగు వేలిముద్రలను సేకరించింది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదే తరహా దొంగతనం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి దిల్ సుఖ్ నగర్ ఒక మొబైల్ షాప్ లో వెనుక ఉన్న గోడను పగలగొట్టి 2 లక్షల రూపాయల చరవాణులు, వాటి విడిభాగాలు దొంగిలించుకుపోయారు. ఇప్పటివరకు ఈ కేసు ఏ కోణంలో ఉంది కూడా తెలియదు. రాత్రి వేళలో గస్తీ తిరిగే సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం కూడా దొంగలకు వీలు కల్పించడం అయిందని, ఇలా గోడలు పగులగొట్టి దోచుకొని పోయే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.



