ప్యాట్నీ నాలా వద్ద ముంచెత్తిన వరద..
ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న హైడ్రా ..
నగర వ్యాప్తంగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో నిమ గ్నమయ్యాయయి. మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్పల్లి, హాఫిజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచినట్లు హైడ్రా కంట్రోల్ రూంకు సమాచారం అందింది.
కాలనీలను ముంచెత్తిన ప్యాట్నీ నాలా :
ప్రతి ఏటా వర్షాకాలం తమ కాలనీలు నీట మునుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ప్యాట్నీ నాలా విస్తరణకు హైడ్రా చర్యలు తీసుకుంది. అయితే ఓ ఇంటి యజమాని పనులను అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో గతంలో మాదిరే సమస్య తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో చిక్కున్న వారిని డీఆర్ ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాల్లో బోటులో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను పర్యవేక్షిస్తున్నారు.
బతుకమ్మ కుంటలోకి వరద నీరు :
అంబర్‌పేటలో బతుకమ్మ కుంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గతంలో వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగేవని.. ఇప్పుడు చెరువు ఆ వరదను ఆపుతోందని స్థానికులు చెబుతున్నారు. భారీ మొత్తంలో వరద నీరు బతుకమ్మ కుంటకు చేరుతోందంటున్నారు.