సమన్వయ సమావేశం నిర్వహించిన హైడ్రా – జీహెచ్ ఎంసీ..
అప్పుడే సమస్యలకు పరిష్కారమన్న ఇద్దరు కమిషనర్లు..
క్షేత్రస్థాయిలో అధికారులుండాలంటూ సూచనలు..
హైడ్రా – జీహెచ్ ఎంసీ పరస్పర సహకారంతో పని చేస్తే వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడగలమని హైడ్రా – జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, కర్ణన్ లు అభిప్రాయ పడ్డారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సమస్యలు.. వాటి పరిష్కారంలో ఇబ్బందులపై ఇరువురు కమిషనర్లు గురువారం జీహెచ్ ఎంసీ కార్యాలయంలో చర్చించారు. ఇరు శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాలా నెట్‌వర్కుపైన క్షుణ్ణమైన అవగాహన ఉన్న జీహెచ్ ఎంసీ ఏఈలు, డీఈలు.. ఫీల్డ్‌మీద పనిచేస్తున్న హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్(ఎంఈటీ)లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు బృందాలకు సహకారం అందించాలని ఇరువురు కమిషనర్లు సూచించారు. హైడ్రా – జీహెచ్ ఎంసీ వేర్వేరు కాదని.. రెండు విభాగాల లక్ష్యం ప్రజలకు ఇబ్బంది లేని మెరుగైన జీవనాన్ని అందించడమే అనేది గ్రహించాలని ఇరు శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వర్షం పడినప్పుడు రహదారులను, నివాస ప్రాంతాలను వరద ముంచెత్తకుండా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరు శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలమండలి సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పనుల పర్యవేక్షణలో పరస్పర సహకారం :
ఆర్‌యూబీల వద్ద డీ వాటరింగ్ పంపుల నిర్వహణ, క్యాచ్‌పిట్స్ క్లీనింగ్, క్యాచ్‌పిట్స్ మధ్యన ఉన్న పైపులలో సిల్ట్ తొలగించడం, నాలా భద్రత, నాలాల క్లీనింగ్, సిల్ట్‌ను తరలించడం, మాన్సూన్ సమయంలో డీసిల్టింగ్ చేయడం, వర్షంలో కొట్టుకొచ్చిన చెత్తను తరలించడం, నాలాల్లో తీసిన సిల్ట్‌ను ఎక్కడకు తరలించాలి.. వార్డు కార్యాలయంలో ఎంఈటీలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. జీహెచ్ ఎంసీ జేసీ, డీసీ స్థాయి నుంచి డీఈలు, ఏఈలు ఇలా అన్ని స్థాయిల్లోనూ పూర్తి సహకారం హైడ్రాకు అందజేయాలని ఇరువురు కమిషనర్లు నిర్ణయించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఇరు శాఖలపై ఉందని అభిప్రాయ పడ్డారు. రోడ్డు అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌ల వద్ద నీరు నిలవకుండా చూడాలని నిర్ణయించారు.
జీవన ప్రమాణాలు పెంచాలి :
ఐటీ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది.. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచడానికి అందరూ కృషి చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ అస్తవ్యస్తం అయితే హైదరాబాద్ ఇమేజీ దెబ్బతింటుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తపేట పై వంతెనపైన, అక్కడ అండర్ పాస్‌లో నీరు నిలవడాన్ని ఉదహరించి.. ఈ సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇరు విభాగాలపై ఉందన్నారు. నగర జీవన ప్రమాణాలు పెంచేందుకు మనందరం కృషి చేయాలని.. ఇందుకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి సమావేశాలు తరచూ జరిగితే సమన్వయం మరింత పెరుగుతుందన్నారు.