పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగ యువతకు కొత్త సంవత్సరం శుభవార్తను తీసుకొస్తోంది. 2026లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేస్తూ, శాఖల వారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నివేదికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఇటీవలి కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు రిటైర్మెంట్ కావడంతో పోలీస్ శాఖతో పాటు ఇతర కీలక విభాగాల్లో ఖాళీలు పెరిగాయి. ఈ ఖాళీలను పదోన్నతులు (Promotions) మరియు నేరుగా నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేయాలనే యాక్షన్ ప్లాన్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది.
జనవరి – ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు
ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటూనే, ప్రభుత్వ రంగంలోనూ ఖాళీల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించి, ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్ల షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉద్యోగాలు
ఇప్పటికే కొన్ని శాఖల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైంది.
- ఆర్టీసీలో 198 సూపర్వైజర్ పోస్టులు
- పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు సంబంధించిన నియామక ప్రకటనలు
- యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర నియామకాలు (జాప్యంతో ఉన్నవి తిరిగి ప్రారంభించే యోచన)
- పలు శాఖల్లో కారుణ్య నియామకాలు
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ ఉద్యోగ అవకాశాలు
అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
పోలీస్ శాఖలో భారీ నియామకాలు
పోలీస్ శాఖలో త్వరలోనే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టంచేశారు. 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపడుతున్నట్లు తెలిపారు.
నిరుద్యోగుల్లో పెరిగిన ఆశలు
పోలీస్ ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ నియామకాలు వేగవంతం అవుతుండటంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. జాబ్ క్యాలెండర్ స్పష్టత రావడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేస్తున్నారు.


