- తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ నిలువెత్తు రూపం: రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు.
- అమ్మమ్మ గారి ఇళ్ల జ్ఞాపకాలను నెరువేసుకున్న పోలీసు బాస్
- ఘనంగా జరిగిన పోలీసు శాఖ వార్షిక సంబరాలు; పాల్గొన్న ప్రముఖ ఉన్నతాధికారులు
హైదరాబాద్
భారతీయ సనాతన ధర్మ సంప్రదాయాలలో, ముఖ్యంగా తెలుగు నేలపై విరాజిల్లె ఆచార వ్యవహారాలలో ప్రకృతి మాతను పూజించే పరమ పవిత్రమైన ఉత్సవం బతుకమ్మ పండుగ. తెలంగాణ ప్రాంతపు జీవన విధానానికి, అస్తిత్వానికి, అపురూప సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయ డిజిపి సి.వి. ఆనంద్ ఉద్ఘాటించారు. బుధవారం నాడు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

*ప్రకృతి ఆరాధనే భారతీయ జీవన విధానం:
దేశవ్యాప్తంగా విజయదశమి పర్వదినాన్ని ప్రాంతీయ ఆచారాల మేరకు వివిధ రూపాలలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమ భారత దేశంలోని గుజరాత్ ప్రాంతంలో దాండియా నృత్యాలు ఎంతటి ప్రాశస్త్యం పొందాయో, దక్షిణ భారత దేశంలోని తెలంగాణ గడ్డపై మాత్రం సృష్టికి మూలమైన ప్రకృతిని గౌరవిస్తూ, గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మను జరుపుకోవడం మన విశిష్టత అని డిజిపి వివరించారు. పూలను పూజించడం, పూలలో దైవత్వాన్ని చూడడం కేవలం మన సంస్కృతిలో మాత్రమే సాధ్యమని తెలిపారు.
బాల్యపు జ్ఞాపకాలు మరియు ఆత్మీయతా భావాలు:
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని డిజిపి తన బాల్యపు మధుర స్మృతులను సభతో పంచుకున్నారు.
చిన్నతనంలో తన అమ్మమ్మ గారింట బతుకమ్మ ఆడిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పండుగ కేవలం మహిళల ఉత్సవం మాత్రమే కాదని, తెలంగాణ ఆడపడుచుల నిస్వార్థ ఆత్మీయతకు, సమాజంలో పరస్పర బంధాలకు సజీవ సాక్ష్యమని ఆయన అభివర్ణించారు. ఈ వేడుకలను ప్రారంభించడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సాంస్కృతిక వేడుకలలో రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన అత్యున్నత శ్రేణి అధికారులు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డిజిపి సి.వి. ఆనంద్ తో పాటు శాంతిభద్రతల విభాగం డిజి మహేష్ భగవత్, సంస్థాగత విభాగం డిజి స్వాతి లక్రా, అదనపు డిజి అకున్ సబర్వాల్, మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్రెడ్డి, రోడ్డు భద్రతా విభాగానికి చెందిన ఐజి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు అనేక మంది కేంద్ర కార్యాలయ అధికారులు, పాలనాధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ పాటలతో, కోలాటాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.



