- -సజ్జనార్ మార్క్ కావాలి
- జనాల్లో మొదలైన అంచనాలు
- -ప్రమాదాలకు ముందే రక్షణ కవచం?
- -పక్కాగా నిబంధనలు అమలుకు చర్యలు-
- మాల్స్, ఆసుపత్రులు, బహుళ అంతస్తులకు భరోసా
- -ముందస్తు నివారణే అసలైన ఆయుధం
- -నిబంధనలు మీరితే భవనాలు సీజ్?-కఠిన చర్యలు, సాంకేతికత మేళవింపు
- -పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం లక్ష్యం
ఊహకందని విదంగా నార్సింగిలోని హైరైస్ అపార్ట్మెంట్లో చోటుచుకున్న అగ్ని ప్రమాదం ఆధునిక విలాస జీవితాలకు సవాల్ విసిరింది. ఆకాశం హద్దు అన్నట్లుగా నిర్మితం అవుతున్న ఆకాశ హర్మ్యాల్లో అగ్గి రాసుకుంటే బతికి బట్ట కడతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకే ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్, తెలంగాణ అగ్నిమాపక విపత్తుల నిర్వహణ శాఖ సారథిగా పగ్గాలు చేపట్టడం కీలక పరిణామం. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలోని ఆకాశహర్మ్యాలు, మాల్స్, పారిశ్రామిక వాడల్లో అగ్నిభద్రతా నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్న వేళ, సామాన్యుడి ప్రాణాలకు రక్షణ కల్పించడం పెను సవాలుగా మారింది. ‘హైడ్రా’ తరహా పారదర్శకత, ఆధునిక సాంకేతికత, ఆకస్మిక తనిఖీలతో 'ముందస్తు నివారణే' లక్ష్యంగా ఆయన దూసుకుపోవాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.
హైదరాబాద్
అడుగుపెట్టిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసి, సంస్కరణలతో జనం మన్ననలు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్, ఇప్పుడు తెలంగాణ అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ మరియు ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) సారథిగా పగ్గాలు చేపట్టడం రాష్ట్ర యంత్రాంగంలో కీలక పరిణామం. గతంలో వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించి, సైబరాబాద్ కమిషనర్‌గా మహిళల రక్షణకు ‘షీ టీమ్స్’ను బలోపేతం చేసి, ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టించిన సజ్జనార్ పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ అంతటా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన భవనాలు, భారీ షాపింగ్ మాల్స్, పారిశ్రామిక వాడలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఉరుకుల పరుగుల నగరీకరణలో సామాన్యుడి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. అక్రమ కట్టడాల భరతం పడుతూ ‘హైడ్రా’ ఏ తీరుగైతే జనాల్లో భరోసా నింపిందో, అగ్నిమాపక శాఖ కూడా అదే వేగం, పారదర్శకతతో దూసుకుపోవాలని జనం కోరుకుంటున్నారు.

కాగితాలకే పరిమితమైన నిబంధనలు.. నిప్పుల కుంపట్లైన భవనాలు!
నగరంలోని మస్తు వాణిజ్య సముదాయాలు, మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. జాతీయ భవన నిర్మాణ నియమావళి (2016), తెలంగాణ అగ్నిమాపక చట్టం-1999 ప్రకారం ప్రతి పెద్ద భవనంలో ఉండాల్సిన కనీస రక్షణ వ్యవస్థలు చాలా చోట్ల తుప్పు పట్టిపోయాయి.
- శాస్త్రీయ లోపాలు:
మంటలు అంటుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా నీళ్లు చిమ్మే యంత్రాలు, పొగను గుర్తించే పరికరాలు, విషవాయువులను బయటకు పంపే యంత్రాంగాలు పనిచేయడం లేదు. నీటి గొట్టాల్లో కనీసం 3.5 నుండి 7 బార్ల ఒత్తిడితో నీళ్లు రావాలనే నిబంధన ఉన్నా, చాలా చోట్ల చుక్క నీరు కూడా రాని దుస్థితి నెలకొంది. - ప్రమాద ఘంటికలు: మాల్స్‌లోని ఆహార విక్రయ కేంద్రాల్లో వంటగ్యాస్ లీకేజీలు, నేలమాళిగ పార్కింగ్‌లలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు, ఇరుకైన గల్లీల్లోని సరుకు నిల్వ కేంద్రాలు నిప్పుల కుంపట్లలా మారాయి. ప్రమాదం జరిగినప్పుడు మంటల కంటే, ఊపిరాడకుండా చేసే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి విషవాయువుల వల్లే 80 శాతం మరణాలు సంభవిస్తున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, ప్రమాద సమయంలో మెట్ల మార్గాల్లో పొగ చేరకుండా గాలి ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం ప్రాణనష్టాన్ని పెంచుతోంది.
ముందస్తు నివారణే అసలైన ఆయుధం:
సజ్జనార్ గత అనుభవాన్ని జోడించి, అగ్నిమాపక శాఖలో ‘ప్రమాదం జరగకముందే నివారణ’ అనే సూత్రంతో ఈ కింది కఠిన చర్యలు చేపడితే అద్భుత ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు:
1.ఆకస్మిక దాడులు.. నిర్లక్ష్యం చేస్తే భవనం సీజ్!
ముందస్తు సమాచారం లేకుండా వారాంతాల్లో, పండుగ రద్దీ వేళల్లో మాల్స్, థియేటర్లు, ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అత్యవసర ద్వారాలకు తాళాలు వేయడం, మెట్ల దారిలో సామాగ్రి పేర్చడం, అగ్నిమాపక పరికరాలు పనిచేయకపోవడం వంటి ప్రాణాంతక ఉల్లంఘనలు దొరికితే క్షణం ఆలస్యం చేయకుండా భవనాన్ని సీజ్ చేయాలి. నిరభ్యంతర పత్రాన్ని రద్దు చేసి, పురపాలక వ్యాపార అనుమతులు, విద్యుత్ సరఫరా నిలిపివేసేలా హైడ్రా తరహా కఠిన చర్యలు తీసుకోవాలి.
2.శాస్త్రీయ ఆధారాలతో సాంకేతిక తనిఖీలు
తనిఖీలకు వెళ్లిన అధికారులు కేవలం నోటి మాటలతో కాకుండా డిజిటల్ పీడన కొలమానాలు, ఉష్ణ గ్రాహక కెమెరాలు, గాలి ప్రవాహ కొలమానాల ద్వారా కొలతలు తీసి, భౌగోళిక ఆధారాలతో కూడిన ఛాయాచిత్రాలు, దృశ్యాలతో పక్కా సాంకేతిక నివేదిక రూపొందించాలి. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చే గుత్తేదారులపై నేరపూరిత కేసులు నమోదు చేయడంతో పాటు ‘ఉల్లంఘించిన వారే చెల్లించాలి’ అనే సూత్రం కింద భారీ జరిమానాలు వసూలు చేయాలి.
3.భౌగోళిక మ్యాపింగ్.. తొలి నిమిషాల్లోనే సహాయక చర్యలు
అగ్నిప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకం. ఆధునిక భౌగోళిక సమాచార వ్యవస్థ, లేజర్ మ్యాపింగ్ సాంకేతికత సాయంతో నగరంలోని అగ్నిప్రమాదాలు, వరదలు, రసాయన లీకేజీల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. పాతబస్తీ, బేగంబజార్ వంటి ఇరుకైన గల్లీల్లోకి పెద్ద అగ్నిమాపక శకటాలు వెళ్లలేవు కాబట్టి, నీటి తుంపరల సాంకేతికతతో కూడిన చిన్న వాహనాలు, వేగంగా స్పందించే ద్విచక్ర వాహన దళాలను మోహరించి, ప్రమాద స్థలానికి చేరుకునే సమయాన్ని 5 నుండి 7 నిమిషాలకు తగ్గించాలి.
4.కృత్రిమ మేధస్సు, రోబోల వినియోగం
భారీ పరిశ్రమలు, సాంకేతిక కారిడార్లు, బహుళ అంతస్తుల భవనాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత కెమెరాలు, స్మార్ట్ సెన్సార్లను నేరుగా అగ్నిమాపక నియంత్రణ గదికి అనుసంధానం చేయాలి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండి మనుషులు లోపలికి వెళ్లలేని చోట మంటలార్పే రోబోలు, ఉష్ణ గ్రాహక డ్రోన్లను వాడాలి. ప్రతి పెద్ద భవనం యొక్క త్రిమితీయ అంతస్తుల నమూనా అగ్నిమాపక వాహనాల్లోని కంప్యూటర్లలో అందుబాటులో ఉంటే, సహాయక చర్యలు చిటికెలో పూర్తవుతాయి. సమీకృత నియంత్రణ కేంద్రం ద్వారా పోలీస్, నగరపాలక, విద్యుత్, వైద్య శాఖలతో సమన్వయం చేసుకోవాలి.
5.సిబ్బంది ఆరోగ్యం.. పౌరుల భాగస్వామ్యం
ప్రాణాలకు తెగించి మంటల్లోకి దూకే అగ్నిమాపక, ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది సంక్షేమం కోసం ‘మహా ఆరోగ్య పరీక్షల’ పేరిట సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ ఆరోగ్య జాతకాలు సిద్ధం చేయడం అభినందనీయమైన అడుగు. దీనికి తోడు ప్రతి వార్డు, బస్తీ స్థాయిలో యువతను ‘ఆపద మిత్ర’ బృందాలుగా తీర్చిదిద్ది ప్రాథమిక అగ్నిమాపక శిక్షణ ఇవ్వాలి. మాల్స్, బడులు, కార్యాలయాల్లో ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా అత్యవసర సన్నద్ధత కవాతులు నిర్వహించాలి.
జనం నమ్మకం గెలిచే అసలైన మార్గం!
ప్రమాదం జరిగినాక హడావుడి చేయడం కంటే, అసలు ప్రమాదమే జరగని కట్టుదిట్టమైన వ్యవస్థను నిర్మించడమే నిజమైన విజయం. ప్రతి షాపింగ్ మాల్, ఆసుపత్రి ముఖద్వారం వద్ద ‘అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ బోర్డు’ (నిరభ్యంతర పత్రం గడువు, భద్రతా స్థాయి, తనిఖీ వివరాలు) జనానికి స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. చరవాణితో స్కాన్ చేస్తే ఆ భవన భద్రతా నివేదిక సామాన్యుడి చేతిలో కనిపించే పారదర్శకత రావాలి. శాస్త్రీయ ఆధారాలు, ఆధునిక సాంకేతికత, కఠినమైన అమలు కలబోతగా సజ్జనార్ నాయకత్వంలో ఈ కార్యాచరణ పట్టాలెక్కితే, తెలంగాణ అగ్నిమాపక శాఖ జనం ప్రాణాలకు తిరుగులేని రక్షణ కవచంగా మారడం ఖాయం!



