హైదరాబాద్, (జూబ్లీహిల్స్):
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వెంట వచ్చిన న్యాయవాదులను పోలీస్‌స్టేషన్ లోపలికి అనుమతించలేదు. పీఎస్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సోమవారం సిట్ అధికారులు హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన జిల్లా పర్యటనలో ఉండటంతో, సిట్ సిబ్బంది కోకాపేటలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల మేరకు నిర్ణీత సమయంలో హరీశ్‌రావు విచారణకు హాజరవడం గమనార్హం.
దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు మాత్రమే కాకుండా న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఈ కేసుకు కేంద్రబిందువుగా ఉన్నాయి. అలాగే ట్యాపింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
దర్యాప్తు క్రమంలో ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్‌ఐబీ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు విదేశాలకు పారిపోవడంతో విచారణకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మిగతా నిందితులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, ప్రభాకర్‌రావు అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు చాలాకాలం నెమ్మదించింది. అయితే గత జూన్‌లో ఆయన హైదరాబాద్‌కు తిరిగి రావడంతో సిట్ దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది.
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, న్యాయ వర్గాల్లోనూ ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో సిట్ విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వర్గాలు భావిస్తున్నాయి.


