- హయత్ నగర్ హైవే పై భారీ అక్రమ నిర్మాణం
- రెండు గృహ నివాస అనుమతులతో భారీ కమర్షియల్ నిర్మాణం..
- నిబంధనలకు తిలోదకాలిచ్చి భారీ నిర్మాణం.. నిద్రమత్తులో యంత్రాంగం!
- హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి ఏం చేస్తున్నట్లు..!
- నిజాలు భాగాలు, మున్సిపల్ కార్పొరేషన్ విజిలెన్స్ విభాగం, అధికారులు ఏం చేస్తున్నట్లు..?
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో ఐఏఎస్, ఏం. ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐ.ఏ.ఎస్ దృష్టి సారించాలి..
బిల్డ్ నౌ వెబ్‌సైట్ : టౌన్ ప్లానింగ్ అవినీతి
బిల్డ్ నౌ వెబ్‌సైట్‌లో పారదర్శకత లోపించడం వల్ల టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పెరిగిపోతున్నాయి. వాణిజ్య భవనాలకు నివాస అనుమతులు ఇవ్వడం, మార్టిగేజ్ మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను ఎగవేయడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ మరియు పార్కు స్థలాలలోనూ అక్రమ అనుమతులు ఇస్తున్నప్పటికీ, తనిఖీ చేయాల్సిన యంత్రాంగం నిరుత్సాహంగా ఉంది. నిబంధనలను ఉల్లంఘించే అధికారులకు ఈ విధానం అండగా మారుతోంది. ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి ఈ వ్యవస్థలో తక్షణమే పారదర్శకతను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎల్బీనగర్:
రాజధాని నగర శివారులో అక్రమ కట్టడాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సాగుతున్న ఈ అనధికార నిర్మాణ పర్వంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గల అధికారులే ఈ అక్రమాలకు కొమ్ముకాస్తుండటంతో అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని కెప్టెన్ కుక్ హోటల్ పక్కన, విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 263, ప్లాట్ నంబర్ 23లో జరుగుతున్న భారీ వాణిజ్య నిర్మాణం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

*నిబంధనల ఉల్లంఘనల పర్వం – శాస్త్రీయ మరియు సాంకేతిక లోపాలు:
- రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ దందాలు: నిబంధనల ప్రకారం 400 గజాల స్థలాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక్కో ప్లాట్‌కు 200 గజాల చొప్పున జీ ప్లస్ టు (G+2) రెసిడెన్షియల్ (నివాస గృహాల) అనుమతులు పొందారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వాణిజ్య (కమర్షియల్) అవసరాల కోసం భారీ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని తలపిస్తూ పనులు సాగిస్తున్నారు.
- పన్ను ఎగవేత మరియు మార్టిగేజ్ మోసం: వాణిజ్య భవనాలకు చెల్లించాల్సిన భారీ అభివృద్ధి రుసుములు, మున్సిపల్ ఫీజులు, మరియు నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి కేటాయించాల్సిన మార్టిగేజ్ స్థలాన్ని ఎగవేసి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
- అతిలోతైన సెల్లార్ తవ్వకాలు – ప్రమాదపు అంచున భవనాలు: ఎలాంటి ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, భారీ యంత్రాలతో అతిలోతైన సెల్లార్‌ను తవ్వడంతో చుట్టుపక్కల ఉన్న భవనాల పునాదులు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
- సెట్‌బ్యాక్‌లు గాలికి.. ఫుట్‌పాత్ కబ్జా: జాతీయ రహదారి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, కనీస సెట్‌బ్యాక్ వదలకుండా రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. పాదచారులు నడిచే ఫుట్‌పాత్‌ను సైతం కబ్జా చేసి నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం గమనార్హం.
*అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?
ఈ భారీ అక్రమ కట్టడంపై స్థానికులు ఆధారాలతో సహా మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్, మరియు హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిగ్గా రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఫిర్యాదులు అందించి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయి పరిశీలన జరపకపోవడం, అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులకు, సదరు భవన యజమానులకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందాలు ఏపాటివో స్పష్టమవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
*భవిష్యత్తులో పెను ముప్పు:
హైవేను ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భారీ భవనం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, సరైన సెట్‌బ్యాక్‌లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*ప్రజల హెచ్చరిక – డిమాండ్:
అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, తక్షణమే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న భవనాన్ని కూల్చివేయడంతో పాటు, ఈ అవినీతి తంతుకు సహకరిస్తున్న బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.



