Saturday, October 24, 2026
Google search engine
Homeతెలంగాణమహిళల విజయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

మహిళల విజయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌

మహిళలకు సమాన అవకాశాలు, స్వేచ్ఛ, భద్రత, గౌరవం కల్పించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. మహిళా సాధికారత సామాజిక న్యాయానికే కాకుండా దేశ సమగ్ర అభివృద్ధికి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో శుక్రవారం ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 41వ దేవి అవార్డుల కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు . కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..
మహిళలు విద్య, విజ్ఞానం, క్రీడలు, వ్యాపారం, కళలు, సంస్కృతి, ప్రభుత్వ సేవలు తదితర రంగాల్లో రాణిస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఒక మహిళ విద్యావంతురాలై, ఆర్థికంగా స్వావలంబన సాధించి నాయకత్వం వహిస్తే దాని ప్రయోజనం కుటుంబానికే కాకుండా సమాజం మొత్తానికి కలుగుతుందన్నారు. మహిళల విజయాలను గుర్తించి గౌరవిస్తున్న దేవి అవార్డుల నిర్వాహకులను అభినందించారు.

మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు. బేటీ బచావో.. బేటీ పఢావో, జననీ సురక్ష యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లఖ్‌పతి దీదీ కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే సాధించారని, తదుపరి లక్ష్యాన్ని ఆరు కోట్లకు పెంచారని వివరించారు.

తెలంగాణలో స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గవర్నర్‌ అన్నారు.
మహిళలకు సొంత ఆదాయం, ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తే కుటుంబాలు బలోపేతమవుతాయని, సమాజం అభివృద్ధి చెందుతుందని గవర్నర్‌ అన్నారు. ప్రతి బాలికకు కలలు కనే, విద్యను అభ్యసించే, నాయకత్వం వహించే, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కల్పించాలని సూచించారు. కుటుంబాలు బాలికల ఆశయాలను ప్రోత్సహించాలని, విద్యాసంస్థలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని, ఉద్యోగ ప్రదేశాల్లో సమాన అవకాశాలతో పాటు సురక్షిత వాతావరణం కల్పించాలని పిలుపునిచ్చారు.

దేవి అవార్డులు అందుకుంటున్న పది మంది మహిళలు తమ తమ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని గవర్నర్‌ ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తెచ్చిన షూటర్‌ ఈషా సింగ్‌, సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్న నటి, నిర్మాత నిహారిక కొణిదెల, జల సంరక్షణకు కృషి చేస్తున్న వాస్తుశిల్పి కల్పనా రమేశ్‌, కృత్రిమ మేధతో ఆహార భద్రతకు తోడ్పడుతున్న సాంకేతిక నిపుణురాలు వైశాలి నియోటియా సేవలను ప్రస్తావించారు.

భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న విద్యా రావు, తెలంగాణ చేనేత కళను ముందుకు తీసుకెళ్తున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ యక్షిణి దీప్తి రెడ్డి, హైదరాబాద్‌ వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్న చరిత్రకారిణి పి. అనురాధా రెడ్డి, బాలికల విద్య, బాలల సంరక్షణ కోసం పనిచేస్తున్న విద్యావేత్త బొంపల్లి భవాని, తెలంగాణ తొలి మహిళా లైన్‌వుమన్‌ బబ్బూరి శిరీష, నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్‌ శిరీషా సెంథిల్‌ సేవలను ఆయన అభినందించారు. అవార్డులు అందుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని గవర్నర్‌ పేర్కొన్నారు. వార్తలను అందించడంతో పాటు సమాజ సేవ, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థల సేవలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.

మహిళలు కుటుంబంతో పాటు సమాజానికి సరైన దిశ చూపగల శక్తి కలిగినవారని గవర్నర్‌ అన్నారు. నశాముక్త భారత్‌ లక్ష్య సాధనలో మహిళలు, పౌరులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుటుంబ స్థాయి నుంచే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 2029 నాటికి నశాముక్త తెలంగాణ, నశాముక్త భారత్‌ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.

దేవి అవార్డులు మహిళల విజయాలను గుర్తించి గౌరవించడంతో పాటు సమానత్వం, భద్రత, సాధికారతతో కూడిన భారత నిర్మాణానికి దోహదపడాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయ సంచాలకుడు ప్రభు చావ్లా, ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీ మీనన్‌ లు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments