- నాన్-లేఅవుట్, నాలా కన్వర్షన్ లేని స్థలంలో 6 అంతస్తులు 8 టవర్లు.. 100కు పైగా ఫ్లాట్లు.
- జీఓ 131 నిబంధనలు గాల్లోకి.. బిల్డ్ నౌ పోర్టల్ వేదికగా కోట్ల రూపాయల అక్రమ అనుమతుల కుంభకోణం.
- అమాయకపు సామాన్య జనానికి ప్లాట్లు అంటగట్టి తడిగుడ్డతో గొంతు కోస్తున్న వైనం..
- బిల్డ్ నౌ , వెబ్సైట్లో పారదర్శకత లోపం ఆసరాగా అధికారుల అవినీతి మాయలు..
- ప్రభుత్వ పన్నులు కోట్ల రూపాయలు సొంత జేబులోకి మళ్లించుకుంటున్న అవినీతి మున్సిపల్ అధికారులు.
- భారీ ముడుపులు తీసుకొని తప్పుడు పద్ధతిలో నిర్మాణ అనుమతులుజారీ
- ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసినా ముడుపులు తీసుకుని చర్యలు తీసుకోలేని సర్కిల్ 60 అధికారుల,డిప్యూటీ కమిషనర్ ఎన్. సుధామ్స్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసిపి భాస్కర్, టిపిఎస్ ముఖేష్ సింగ్.
- సి.ఎం. సి కమిషనర్, శ్రీజన, సిసిపి వెంకన్న చర్యలు ఎక్కడ..!
- సి.ఎం.సి విజిలెన్స్, ఏసీబీ నిఘా విభాగ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.
- కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్, డైరెక్టర్, దేవేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి, అవినీతి అధికారుల ఆట కట్టించాలని స్థానిక ప్రజల డిమాండ్..
గుండ్లపోచంపల్లి సర్కిల్ 60 లో అక్రమ అనుమతుల ‘థీము’ అదరహో! నాలా కన్వర్షన్ లేదు, లేఅవుట్ అనుమతి అంతకన్నా లేదు. కానీ ‘బిల్డ్ నౌ’ పోర్టల్ పుణ్యమా అని అక్రమార్కులకు మార్గం సుగమమైంది. జీఓ 131 కటాఫ్ తేదీలను బేఖాతరు చేస్తూ, మార్ఫింగ్ పత్రాలతో 6 అంతస్తులు, 8 టవర్లలో 100కు పైగా ఫ్లాట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆరు నెలలుగా ఆధారాలతో ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదమరిచిన నిద్ర వీడకపోవడం వెనుక కోట్ల రూపాయల ‘చేతివాటం’ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను బుట్టదాఖలు చేసిన ఈ అక్రమ ‘కింగ్స్ కోర్ట్’ కుంభకోణంపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా కంటివికార్లైనా తెరవాల్సి ఉంది!
కుత్బుల్లాపూర్
రాష్ట్రంలో పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన విధానాలను కొందరు అవినీతి అధికారులు స్వార్థానికి వాడుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో తిష్టవేసిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ‘బిల్డ్ నౌ’ వెబ్సైట్ పోర్టల్‌ను వేదికగా చేసుకుని అక్రమ అనుమతుల పర్వానికి తెరలేపారు. మార్ఫింగ్ చేసిన ఎల్ఆర్ఎస్ పత్రాలు, తప్పుడు ఆధారాలతో ఎలాంటి నాలా కన్వర్షన్, లేఅవుట్ అనుమతులు లేకపోయినా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేశారు.

*ఎల్.ఆర్.ఎస్-2020 నిబంధనలకు పాతర
జీఓ నంబర్ 131 (తేదీ: 31-08-2020) ప్రకారం 26-08-2020 నాటికి నమోదైన హక్కులు/టైటిల్ కలిగిన ప్లాట్లకే క్రమబద్ధీకరణ, భవన నిర్మాణ అనుమతులకు అర్హత ఉంటుంది. కానీ కాజీగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 10, 13లలో ఈ నిబంధనలను తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేశారు.
- విక్రయ పత్రం 1: 12957/2024 (మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లింక్డ్ AGPA నంబర్: 8159/2024)
- విక్రయ పత్రం 2: 8251/2025
కటాఫ్ తేదీ 26-08-2020 తర్వాత రిజిస్టర్ అయిన ఈ పత్రాల ఆధారంగా భవన నిర్మాణ అనుమతి ఏ విధంగా ఇచ్చారనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ఖజానాకు కోట్లలో గండి!
కాజీగూడలోని సర్వే నంబర్లు 10, 13లలో ‘థీము కింగ్స్ కోర్ట్’ పేరుతో 6 అంతస్తులు, 8 టవర్లలో 100కు పైగా ఫ్లాట్లను అక్రమ పద్ధతిలో అనుమతులు పొంది నిర్మిస్తున్నారు. తప్పుడు పత్రాలతో అనుమతులు తెచ్చుకుని, అమాయక ప్రజలకు ఫ్లాట్లు అమ్మి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రుసుములు ఎగ్గొట్టి, ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి కొడుతున్నారు.

రాతపూర్వక ఫిర్యాదులు చేసి ఆరు నెలలు గడిచినా నిశ్శబ్దం:
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కుత్బుల్లాపూర్ జోన్, సర్కిల్ 60 పరిధిలోని అధికారులకు ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసి ఆరు నెలలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుండ్ల పోచంపల్లి సర్కిల్ 60 డిప్యూటీ కమిషనర్ ఎన్. సుధామ్స్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసిపి భాస్కర్, టిపిఎస్ ముఖేష్ సింగ్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బాధితులు, స్థానికుల డిమాండ్లు
- అనుమతుల రద్దు: వివాదాస్పద భవన నిర్మాణ అనుమతి (Permit No: 0040/BP/3140/2025) చట్టబద్ధతను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తక్షణమే రద్దు చేయాలి.
- పనుల నిలిపివేత: విచారణ పూర్తయ్యే వరకు స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేస్తూ నోటీసులు జారీ చేయాలి.
- సమగ్ర విచారణ: బిల్డ్ నౌ వెబ్సైట్ ద్వారా జరిగిన అక్రమాలు, సంబంధిత దస్త్రాలు, ఎల్ఆర్ఎస్ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
- కఠిన చర్యలు: ఫిర్యాదులపై ఆరు నెలలుగా చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ద్వారా విచారణ జరిపించాలి.
- పునఃపరిశీలన: గత కొన్ని సంవత్సరాలుగా కటాఫ్ తేదీ తర్వాత నమోదైన పత్రాల ఆధారంగా మంజూరు చేసిన భవన నిర్మాణ అనుమతులన్నింటినీ తిరగదోడాలి.
ఈ భారీ కుంభకోణంపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సి.ఎం.సి కమిషనర్ శ్రీజన , సిసిపి వెంకన్న, కలెక్టర్ మను చౌదరి, తక్షణమే స్పందించి విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు.


