- శంకర్ లింగ రైస్ మిల్లులో రూ.7.85 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం
- అధికారుల పర్యవేక్షణ లోపంతో వేలాది బస్తాల గోల్‌మాల్
- స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు; సమగ్ర విచారణకు డిమాండ్
మాగనూరు
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ పరిధిలోని శంకర్ లింగ రైస్ మిల్లులో భారీ ధాన్యం గోల్‌మాల్ వ్యవహారం వెలుగు చూసింది. సుమారు రూ.7.85 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రభుత్వ ధాన్యం నిల్వలకు రక్షణ కరువైందా? కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని మిల్లులో భద్రపరిచిన అధికారులు ఆ నిల్వలను పర్యవేక్షించడంలో విఫలమయ్యారా? అనే ప్రశ్నలు ఈ సంఘటనతో ఉత్పన్నమవుతున్నాయి.

80,972 బస్తాలు ఏమయ్యాయి?
ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా సరఫరా అధికారి బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్ లింగ రైస్ మిల్లులో సుమారు 76,000 బస్తాల ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కేటాయించారు. అదేవిధంగా 2024–25 యాసంగి సీజన్‌కు సంబంధించి మరో 4,972 బస్తాల ధాన్యం కలిపి మొత్తం 80,972 బస్తాలను మిల్లులో భద్రపరిచారు.
అయితే తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం. మాయమైన ఈ ధాన్యం మొత్తం విలువ రూ.7,85,30,918 గా అధికారులు నిర్ధారించారు.

గతంలోనూ అక్రమాలు:
ఈ వ్యవహారంలో గత చరిత్రను పరిశీలిస్తే మరొక అంశం వెలుగులోకి వస్తోంది. 2023 లో మల్లికార్జున రైస్ మిల్లులో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఆ మిల్లు యజమాని దండే కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ సమయంలో ఆ మిల్లులోని ధాన్యాన్ని భద్రపరిచేందుకు సొంత సోదరుడికి చెందిన శంకర్ లింగేశ్వర రైస్ మిల్లుకు అప్పగించారు.
అయితే ఆ ధాన్యం భద్రత, నిల్వల పర్యవేక్షణకు సంబంధించి అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించారు? ఎప్పటికప్పుడు నిల్వలను ధ్రువీకరించారా? లేదా? అనే విషయాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల అలసత్వమే కారణమా?
ప్రభుత్వ ధాన్యం కోట్లాది రూపాయల విలువతో మిల్లులో నిల్వ ఉన్నప్పుడు దాని భద్రతను నిర్ధరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, దస్త్రాలతో భౌతిక నిల్వలను సరిపోల్చడం, అక్రమ తరలింపులు జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
వేలాది బస్తాల ధాన్యం మాయమయ్యే వరకు ఈ వ్యవహారం బయటకు రాకపోవడం పర్యవేక్షక వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది. అధికారుల నిర్లక్ష్యం ఉందా? లేక ఈ వ్యవహారంలో మరెవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో సమగ్ర విచారణ జరగాల్సి ఉంది.
*యజమానిపై కేసు నమోదు:
ఈ ఘటనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శంకర్ లింగ రైస్ మిల్లు యజమాని దండే తమన్నపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
కేవలం కేసు నమోదుతో సరిపెట్టకుండా, ప్రభుత్వ ధాన్యం ఎక్కడికి తరలించారు? బాధ్యులు ఎవరు? పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని, ప్రజాధనాన్ని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



