- వయసుతో సంబంధం లేకుండా స్ట్రోక్స్
- మారతున్న జీవనశైలే ప్రధానం కారణం
- ఇప్పటికైన మేలుకొంటేనే ఉత్తమం
డా. కె.ఎస్.వి. సూర్య తేజ రెడ్డి
చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరోరేడియాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్
శేరిలింగంపల్లి
బ్రెయిన్ స్ట్రోక్స్ (పక్షవాతం) ఒకప్పుడు వయసు పెరిగివ వారిలో మాత్రమే చూసేవాళ్లం. కానీ ఇప్పుడు మాత్రం నెలలో దాదాపు 15 మంది వరకు బ్రెయిన్ స్ట్రోక్స్ తో బాధపడేవారిని ఓపీలో చూస్తున్నామని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కె వి ఎస్ సూర్య తేజ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య వయసుల వారిలో. ఇప్పటికే అర్ధమైపోయిం ఉండవచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ ఏ వయసు వారిని ప్రభావితం చేస్తున్నాయో. కాగా ప్రజల్లో ఈ స్ట్రోక్స్ గురించి సరైన అవగాహన లేదు. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న అంతర్జాతీయ బ్రెయిన్ స్ట్రోక్స్ డే గా నిర్వహిస్తారు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం “ప్రతి నిమిషం విలువైనదే వెంటనే స్పందించండి” అనే సందేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరికి జీవితకాలంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అంచనా. మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిన ప్రతి నిమిషం లక్షలాది నాడీకణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే స్ట్రోక్ చికిత్సలో సమయం అత్యంత కీలకం.
అసలు బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి.
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడినా, రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలకు ఆక్సిజన్ అందక దెబ్బతింటాయి. ఫలితంగా శరీరంలోని ఒకవైపు బలహీనత, మాట పడిపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు.
బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు దగ్గరలోని అన్ని సదుపాయాలు కలిగిన స్ట్రోక్స్ రెడీ హాస్పిటల్ వెళ్లాలి. స్ట్రోక్స్ వల్ల మెదడులో రక్తనాళాలల్లో రక్తం గట్టకట్టినట్లు అయితే ఇటీవల వచ్చిన అధునాతన మెకానికల్ థ్రోంబెక్టమీ చికిత్స మరియు స్టెంట్స్ రిట్రివర్ ద్వారా తీసివేయవచ్చు.
స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు
- అధిక రక్తపోటు: స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకం. రక్తనాళాలు దెబ్బతినడం, రక్తనాళం చిట్లి రక్తస్రావం జరగడం వంటి ప్రమాదాలను పెంచుతుంది.
- రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం
మెదడుకు రక్త సరఫరా చేసే నాళంలో గడ్డ ఏర్పడటం వల్ల మెదడులోని కొంత భాగానికి రక్తం అందదు. - మధుమేహం, అధిక కొలెస్ట్రాల్
ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీసి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. - గుండె సంబంధిత సమస్యలు
ముఖ్యంగా గుండె కొట్టుకునే లయలో లోపం (Atrial Fibrillation) ఉన్నప్పుడు గుండెలో ఏర్పడిన రక్తపు గడ్డ మెదడుకు చేరి స్ట్రోక్‌కు కారణం కావచ్చు. - పొగతాగడం, పొగాకు వినియోగం
రక్తనాళాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరగడం ద్వారా స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. - మెదడులో రక్తనాళం చిట్లడం
రక్తనాళం బలహీనపడటం, అనూరిజం వంటి సమస్యలు లేదా అదుపులో లేని అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావం సంభవించవచ్చు.
ఏ వయస్సు వారికైనా స్ట్రోక్ రావచ్చా?
అవును. వృద్ధుల్లో ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ యువత, మధ్యవయస్కుల్లోనూ స్ట్రోక్ రావచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ చరిత్ర, కొన్ని గుండె లేదా రక్తనాళ సమస్యలు ప్రమాదాన్ని పెంచుతాయి. కొంతమంది యువకుల్లో స్పష్టమైన కారణం గుర్తించడానికి ప్రత్యేక పరీక్షలు అవసరమవుతాయి.
స్ట్రోక్ రాకుండా ఉండాలంటే
- రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.
- మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి.
- పొగతాగడం మానేయాలి.
- ఉప్పు తక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
- వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- గుండె సంబంధిత సమస్యలకు సరైన చికిత్స తీసుకోవాలి.
స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించండి
18 నుండి 44 ఏళ్ల వయసు వారిలో 13.8 శాతం, 45 నుండి 64 ఏళ్ల వయసు వారిలో 47.2 శాతం, 65 ఏళ్ల పై బడిన వారిలో 39.01 శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఎక్కువగా యువత ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ కు గురవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల ఉద్యోగులు. వారు క్రమరహితంగా విధులకు వెళ్లడం, పని ఒత్తిడి, అధికంగా ఆలోచించడం, సరైన నిద్ర లేకపోవడం, శారీరక వ్యాయామాలు లేకపోవడం వలన మధుమేహం, బీపీ వంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి.
ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం, మాట తడబడటం, చూపు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. లక్షణాలు తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకండి. వైద్యుల సలహా లేకుండా ఆస్పిరిన్ వంటి మందులు ఇవ్వకండి; మెదడులో రక్తస్రావం ఉంటే అవి ప్రమాదకరం కావచ్చు.


