Home తెలంగాణ *హైడ్రా రంగనాథ్ ఉండాలంటూ స్వచ్ఛంద ప్రజా ర్యాలీలు.

*హైడ్రా రంగనాథ్ ఉండాలంటూ స్వచ్ఛంద ప్రజా ర్యాలీలు.

0
2

హైడ్రాకు ప్రజా నీరాజనం!

  • ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు
  • నగరవ్యాప్తంగా కాలనీ సంక్షేమ సంఘాల భారీ ర్యాలీలు
  • హైడ్రా కొనసాగింపునకు ప్రజల స్పష్టమైన తీర్మానం

*హైదరాబాద్:

నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన హైడ్రాకు నగరంలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వరదల కట్టడికి గొలుసుకట్టు చెరువుల అవసరాన్ని గుర్తించి, వాటి పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించడాన్ని సంఘాలు స్వాగతించాయి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలను కీర్తిస్తూ, ఇటీవల సామాజిక మాధ్యమాలలో వస్తున్న నిరాధార వార్తలను తీవ్రంగా ఖండించాయి.
శ్రీనివాసనగర్ వెస్ట్, వెంగల్‌రావునగర్, మధురనగర్, మోతీనగర్, రాజీవ్‌నగర్, సిద్ధార్థనగర్, సాయిసారథినగర్, జయప్రకాశ్‌నగర్, ఇంజనీర్స్ కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మధురనగర్, శ్రీనివాసనగర్, అమీర్‌పేట్ పరిసరాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున కదిలివచ్చారు.

*అసాధ్యం అనుకున్నది సుసాధ్యం..
హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని, సుమారు 3325 ఎకరాల విస్తీర్ణాన్ని కాపాడటం సామాన్యమైన విషయం కాదని వక్తలు ప్రశంసించారు. తొలి విడతలో 6 చెరువులు, రెండో విడతలో 14 చెరువులను పునరుద్ధరించి ఆయా ప్రాంతాల్లో వరద ముప్పును పూర్తిగా నివారించడాన్ని నగర ప్రజలు కనులారా చూస్తున్నారని కొనియాడారు.

*వరద ముప్పు నుంచి విముక్తి..
ఐదు సెంటీమీటర్ల వర్షం పడితే చాలు అమీర్‌పేట్ పరిసరాలు నీట మునిగేవి. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ కింద పూడుకుపోయిన పైపులైన్లను గుర్తించి, వారం రోజుల్లోనే ఆరు లైన్లను తెరిచి వరద ముప్పు లేకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి శాఖల సమన్వయంతో ఈ కార్యాచరణ విజయవంతమైంది. ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనలతో సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. ప్యాట్నీ నాలా విస్తరణ పనులతో ఆ ప్రాంతంలోనూ వరద భయం తొలగిపోయింది.

*బురదజల్లితే సహించేది లేదు..
కబ్జాదారుల ఆటలు సాగకపోవడం, వారికి సహకరించే నాయకుల మాట చెల్లకపోవడంతోనే కొందరు హైడ్రాపై బురద చల్లుతున్నారని కాలనీవాసులు మండిపడ్డారు. పర్యావరణ హితమైన నగరమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు నగర ప్రజల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రాను నిరంతరం కొనసాగించాలని, అదేవిధంగా కమిషనర్ బాధ్యతలలో ఏవీ రంగనాథ్ సేవలను కొనసాగించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here