- ఆక్రమణల తొలగింపుతో 135.8 ఎకరాలకు విస్తరణ.
- సహజ లక్షణాల పునరుద్ధరణ, ఆహ్లాదకర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక.
- భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
- ప్రత్యేక అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ
హైదరాబాద్:
అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రగతినగర్ ప్రాంతవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, నగరంలో వరద ముప్పును శాశ్వతంగా నివారించే దిశగా అంబీర్ చెరువు పునరుద్ధరణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యుడు అరెకపూడి గాంధీతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భూమిపూజ చేసి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు చెరువు ఒడ్డున జమ్మిచెట్టును నాటి పనులకు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి 162 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 121.2 ఎకరాలకు కుచించుకుపోయింది. శాస్త్రీయ సర్వేల ఆధారంగా ఆక్రమణలను తొలగించి, చెరువు విస్తీర్ణాన్ని 135.8 ఎకరాలకు పెంచనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. చెరువులో నాలుగైదు మీటర్ల లోతున పేరుకుపోయిన ప్లాస్టిక్, వ్యర్థాలు, పూడికను పూర్తిస్థాయిలో తొలగించనున్నారు. పూడికతీత వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం భారీగా పెరగడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. 10.23 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఆరు ప్రధాన వరద కాలువలను ఆధునీకరించనున్నారు.
కేవలం నీటి వనరుగానే కాకుండా, అంబీర్ చెరువును పర్యావరణ హితమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. చెరువు చుట్టూ పటిష్టమైన కట్ట నిర్మాణంతో పాటు నడక దారులు, పిల్లల ఆటస్థలాలు, బహిరంగ వ్యాయామశాలలు, సందర్శకులు సేదతీరేందుకు విశ్రాంతి మండపాలను నిర్మించనున్నారు. చెరువు మధ్యలోని సహజ సిద్ధమైన కొండల వద్ద సాహస క్రీడలకు, నీటిలో పడవ విహారానికి, జల క్రీడలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
అహ్మదాబాద్‌లోని కంకారియా సరస్సు ఉత్సవాల తరహాలో ఇక్కడ కూడా ఏటా వేడుకలు నిర్వహించేలా తీర్చిదిద్దుతామని కమిషనర్ తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న రహదారిని విస్తరించి, పాదచారులు సురక్షితంగా దాటేందుకు ఆకాశ వంతెనను నిర్మించనున్నారు. నీటిని పూర్తిగా ఖాళీ చేయకుండా, రహదారికి ఇరువైపులా విడతల వారీగా పనులు చేపట్టడం ద్వారా జలచరాలకు, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ్మిడికుంట కంటే అత్యద్భుతంగా దీనిని తీర్చిదిద్ది ప్రజలకు కానుకగా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ద్వారా వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి ఎద్దడి లేని నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా హైడ్రా పనిచేస్తోందని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ పనితీరు అభినందనీయమన్నారు. ఆదిలో హైడ్రా చర్యలను వ్యతిరేకించిన వారు సైతం, నేడు చెరువుల సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ ఫలితాలను చూసి అభినందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్‌కుమార్, సహాయ పోలీసు కమిషనర్ పి. తిరుమల్ తదితరులు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక వివరాలను విమోస్ సాంకేతిక సంస్థ సంచాలకుడు యూనస్ పర్వేజ్ అధికారులకు వివరించారు.



