Saturday, February 14, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యం

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉత్కంఠభరిత పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠ కొనసాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ గెలుపుకోసం తీవ్రంగా పోరాడగా, ఆఖరికి భారత్ విజయం వరించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) శుభారంభం అందించగా, మిడిల్ ఆర్డర్‌లో డారిల్ మిచెల్ (84) దూకుడుగా ఆడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా, కుల్‌దీప్ యాదవ్ ఒక వికెట్ సాధించాడు.

301 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. 93 పరుగులతో సెంచరీకి చేరువలో ఔటైన కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేలకుపైగా పరుగులు పూర్తి చేసిన ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా కోహ్లీ మరో ఘనత సాధించాడు. శుభ్‌మన్ గిల్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, రోహిత్ శర్మ (26) మంచి ఆరంభం ఇచ్చాడు.

చివర్లో టెన్షన్.. కానీ భారత్‌దే గెలుపు

39 ఓవర్లకు భారత్ స్కోరు 234/2గా ఉండగా, గెలుపు భారత్‌కే ఖాయంగా కనిపించింది. అయితే, కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒకే ఓవర్‌లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా (4)ను ఔట్ చేసి భారత అభిమానుల్లో కాస్త టెన్షన్ పెంచాడు. చివరి 66 బంతుల్లో 67 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, కీలక సమయంలో హర్షిత్ రాణా (29), కేఎల్ రాహుల్ (29*) ధైర్యంగా ఆడి మ్యాచ్‌ను మళ్లీ భారత్ వైపు తిప్పారు. గాయంతో ఇబ్బంది పడిన వాషింగ్టన్ సుందర్ (7*) చివరివరకు క్రీజ్‌లో నిలిచి కీలక పాత్ర పోషించాడు. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు అవసరం కాగా, 49వ ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు.

సిరీస్‌పై భారత్ పట్టు

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డేలోనూ ఇదే జోరు కొనసాగించాలని టీమ్‌ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. న్యూజిలాండ్ మాత్రం సిరీస్‌లో నిలబడాలంటే వచ్చే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments