కందుకూరు
కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ అధికారులు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో/ ఏఈఆర్వో ఎన్. జగదీశ్వర్ రెడ్డి పాల్గొని, పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తుల ధృవీకరణలో పాటించాల్సిన విధి విధానాలు, దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన, అవసరమైన ధ్రువపత్రాల ధృవీకరణ, దరఖాస్తుల్లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డీటీ (ఎన్నికలు) నరేష్ తదితరులు పాల్గొన్నారు.
*ప్రజలకు విజ్ఞప్తి:
అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునేందుకు సంబంధిత అధికారులను సంప్రదించి, అవసరమైన దరఖాస్తును సరైన వివరాలు, ధ్రువపత్రాలతో సమర్పించాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఓటరు జాబితాలో తమ పేరు నమోదైందో లేదో నిర్ధారించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండి, ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా భాగస్వామి కావాలని కోరారు.



