- పార్థివదేహంపై పూలమాల వేసి అంజలి ఘటించిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు పారిజాత నర్సింహారెడ్డి
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
మహేశ్వరం:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామానికి చెందిన హస్తం పార్టీ సీనియర్ నాయకులు టైగర్ నరసింహ అకాల మరణం పట్ల ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విషయం తెలిసిన వెంటనే పారిజాత నర్సింహారెడ్డి గొల్లూరులోని నరసింహ నివాసానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి టైగర్ నరసింహ చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారని, ఆయన మృతి మహేశ్వరం నియోజకవర్గ హస్తం శ్రేణులకు తీరని లోటని పేర్కొన్నారు. నరసింహ కుటుంబానికి పార్టీ అధిష్ఠానం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో మండల, గ్రామ స్థాయి హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



