Home ఆంధ్రప్రదేశ్ కొండగట్టులో పూజలు చేసిన పవన్‌ కల్యాణ్‌

కొండగట్టులో పూజలు చేసిన పవన్‌ కల్యాణ్‌

0
కొండగట్టులో పూజలు చేసిన పవన్‌ కల్యాణ్‌
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్‌ కల్యాణ్‌ – భక్తుల సౌకర్యాల కోసం రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రూ.35.19 కోట్లతో ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి భూమిపూజ

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

భక్తుల వసతి సౌకర్యాల విస్తరణ లక్ష్యంగా రూ.35.19 కోట్ల వ్యయంతో 96 గదులతో కూడిన ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే కొండగట్టు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

“అభివృద్ధి పనులు ప్రారంభించాలంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చిన స్థలం. గతంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదం నుంచి నేను బయటపడటం ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆ సమయంలో కొండగట్టు ఆంజనేయస్వామి నన్ను కాపాడారు. దీక్ష విరమణ మండపం, భక్తుల కోసం సత్రం కావాలని గతంలో ఇక్కడి వారు నన్ను కోరారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకుల సమష్టి కృషితో ఈ రోజు అది కార్యరూపం దాల్చుతోంది” అని అన్నారు.

కొండగట్టు ఆలయం తెలంగాణలో ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. ముఖ్యంగా శనివారం, హనుమాన్ జయంతి, దీక్షకాలంలో లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా వసతి సదుపాయాల కొరత సమస్యగా ఉండటంతో, తాజా అభివృద్ధి పనులు ఆలయ ప్రాంగణానికి మరింత ప్రాధాన్యం తీసుకురానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here