కోహ్లీ కమ్ బ్యాక్ అంటూ ట్వీట్లు..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఆత్మవిశ్వాసంతో తొలి టెస్టుకు సిద్దమవుతోంది. పెర్త్‌లో నవంబర్ 22న కంగారూలతో టీమిండియా తలపడనుండగా అందరి కండ్లన్నీ ఒకేఒక్కడి మీద ఉన్నాయి. అతడే భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆసీస్ అంటే చాలు రెచ్చిపోయి ఆడే విరాట్.. వాళ్ల స్లెడ్జింగ్‌కు, కవ్వింపులకు డబుల్ రెట్లు వెనక్కి ఇచ్చేస్తాడు. కంగారూల గడ్డపై మరే భారత ఆటగాడు చూపని తెగువ, దూకుడు కోహ్లీకే సాధ్యమైంది. ఆస్ట్రేలియా గడ్డపై శతకాల మోత మోగించిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల కంటే అతడు విభిన్నం. వాళ్లలా మౌనముని కాదు కోహ్లీ. మాటలకు తూటాలా జవాబిచ్చే నిప్పుకణిక అతడు. అంతేనా.. అందుకనే ఆసీస్ మాజీలకు కూడా అతడంటే ఇష్టం. తమకు తగ్గ పోటీదారుడు అని పలువురు పలు సందర్బాల్లో అభిప్రాయపడ్డారు కూడా.
పేస్, బౌన్స్ పిచ్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకున పెట్టే ఆస్ట్రేలియన్లకు కోహ్లీ అంటే హడల్. మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ ఆసీస్ పేస్ బౌలర్లపై తన ఆధిపత్యానికి సాక్ష్యంగా కింగ్ వాళ్ల నేలపై ఒకటి రెండు కాదు ఆరు సెంచరీలతో తన తడాఖా చూపించాడు. అందుకే కోహ్లీ భారత స్క్వాడ్‌లో ఉన్నాడంటే కంగారుల్లో కలవరం. ‘వామ్మో మళ్లీ వస్తున్నాడా?’ ‘ఆటతో, మాటలతో, చేష్టలతో మా పని పడుతాడు?’ అని ప్రతి ఆసీస్ క్రికెటర్ మనసులో తెలియని కంగారు. అయితే.. ‘అదంతా గతం. ఇప్పుడు మనం చూస్తున్న కోహ్లీ వేరు అంటున్నారు’ ఆసీస్ మాజీ సారథులు రికీ పాంటింగ్, మైఖేల్ క్కార్క్‌లు. అందుకు కారణం లేకపోలేదు. ఒకప్పటి చిరుత పులి కాదు విరాట్ అనేది మనమూ అంగీకరించాల్సిందే. ఎందుకంటే రన్ మెషీన్‌లో పరుగుల దాహం కాస్త నెమ్మదించింది.
ఒకానొక సమయంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో వరుసపెట్టి శతకాలతో భయపెట్టిన కింగ్ కోహ్లీ ఇప్పుడు డీలా పడ్డాడు. అతడు మునపటిలా ఆడడం లేదు. అందుకనే ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ అలరిస్తాడా? లేదా? అనే సందేహం వంద కోట్లకు పైగా అభిమానుల్లో ఉంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో విరాట్ ఒక్క సెంచరీ కొట్టలేకపోయాడు. అంతేకాదు ఈ ఐదేండ్లలో కోహ్లీ రెండే రెండుమార్లు వందకు చేరువై అభిమానుల పెదవి నవ్వులు పూయించాడు.