- రెండు నెలల పీఎఫ్ బకాయిలపై భగ్గుమన్న కార్మిక లోకం
- ఉన్నతాధికారులను ఆశ్రయించిన ఔట్సోర్సింగ్ యూనియన్ నాయకులు.. తక్షణ చర్యలకు డిమాండ్
హైదరాబాద్:
నగరంలోని జలమండలి పరిధిలో ఔట్సోర్సింగ్ కార్మికుల శ్రమను దోచుకుంటూ, వారి భవిష్యత్తు నిధిని కొల్లగొడుతున్న సుమతీ కార్పొరేట్ సర్వీసెస్ సంస్థ అక్రమాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రైవేట్ ఏజెన్సీ, 2021 సంవత్సరానికి సంబంధించిన రెండు నెలల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బకాయిలను ఇప్పటివరకు జమ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థపై కార్మిక సంఘం నాయకులు మరోసారి జలమండలి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఫిర్యాదు అందజేశారు.
ఇటీవల ఆగస్టు నెలలోనూ డైరెక్టర్ ఖాదర్‌ను కలిసి సంస్థ అక్రమాలను ఏకరువు పెట్టినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి సత్ఫలితం రాకపోవడంపై కార్మిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఔట్సోర్సింగ్ యూనియన్ నాయకులు డైరెక్టర్‌తో పాటు చీఫ్ జనరల్ మేనేజర్ సురేష్‌ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందిని మరోసారి వారి దృష్టికి తీసుకెళ్లారు.
*అధికారుల పర్యవేక్షణ లోపంపై కార్మిక సంఘాల మండిపాటు
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సంబంధిత ఏజెన్సీలో చలనం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు విధుల్లో ప్రమాదాలు సంభవించిన సమయాల్లో కూడా ఏజెన్సీ యాజమాన్యం కనికరం లేకుండా వ్యవహరిస్తూ, కనీస మానవతా విలువలను విస్మరిస్తోందని యూనియన్ నాయకుడు కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్న ఇలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
*భవిష్య నిధికి తూట్లు.. పెన్షన్ ప్రయోజనాలకు విఘాతం
రెండు నెలల పీఎఫ్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకపోవడం వల్ల వారి సర్వీసు రికార్డులపై తీవ్ర ప్రభావం పడుతోందని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. ఈ బకాయిల వల్ల ఉద్యోగులకు భవిష్యత్తులో అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్ లబ్ధి ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు.
*తక్షణ చర్యలు తీసుకోకుంటే తీవ్ర ఉద్యమం
సుమతీ కార్పొరేట్ సర్వీసెస్ సంస్థ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, నిబంధనల ప్రకారం రావాల్సిన బకాయిలను తక్షణమే రికవరీ చేసి కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉధృత పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని వారు హెచ్చరించారు.


