హైదరాబాద్:
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి ఏఐజీ (అడ్మిన్) జె. అన్యోన్య పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజానాయకుడిగా సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వయసును సైతం లెక్కచేయకుండా ఉద్యమించిన ఆయన త్యాగం, నిబద్ధత చిరస్మరణీయమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏఐజీ (అడ్మిన్) జె. అన్యోన్యతో పాటు స్టోర్స్ డీఎస్పీ సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


