హైదరాబాద్
నగరంలోని చెరువులను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతూ, వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న తీరు ప్రజల నుంచి అపూర్వ స్పందనను రాబడుతోంది. హైడ్రా చేపడుతున్న పూడికతీత మరియు సుందరీకరణ పనులు సత్ఫలితాలనిస్తున్నప్పటికీ, తమ ప్రాంతాల చెరువులను కూడా తక్షణమే అభివృద్ధి చేయాలని కోరుతూ సోమవారం నగరవాసులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. చెరువుల పరిరక్షణతో పాటు కాలుష్య నివారణపై వచ్చిన వినతులతో ప్రజావాణి మార్మోగింది.
*చెరువుల అభివృద్ధిపై నగరవాసుల విజ్ఞప్తులు
హైడ్రా చేపట్టిన పనుల వల్ల చెరువుల చుట్టూ దుర్గంధం తొలగి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని ప్రజలు కొనియడారు. అయితే, ఈ అభివృద్ధి కొన్ని జలవనరులకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సుందరీకరణే కాకుండా, చెరువుల్లో పది అడుగులకు పైగా పూడికను తొలగించి దుర్గంధాన్ని పారదోలిన తీరు అభినందనీయమని ప్రశంసించారు. నగరంలోని అన్ని జలశయాలను ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ‘జనవాణి’ సంస్థ హైడ్రాను కోరింది.
అభివృద్ధి చేసిన చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా వర్షాకాలంలో వరద నీరు, మిగతా సమయాల్లో ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. గండిపేటతో పాటు హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు కలుషితమవుతున్నాయని, వాటిని కాపాడాలని కోరుతూ పలువురు వినతిపత్రాలు అందజేశారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో మొత్తం 61 ఫిర్యాదులు అందగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించి తక్షణ విచారణకు ఆదేశించారు.
*ప్రజావాణిలో స్వీకరించిన ముఖ్యమైన ఫిర్యాదులు:
- నాగోలు చెరువు పరిరక్షణ: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని 14 ఎకరాల నాగోలు చెరువు మురుగు నీటి చేరికతో దుర్గంధభరితంగా మారింది. చుట్టుపక్కల నివాసితులు ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారని, శ్రీనివాస ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
- గాజుల రామారం ఆక్రమణలు: కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం పరిధిలోని సర్వే నంబర్లు 42, 43లోని చెరువు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లలో అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, వాటిని నిలువరించాలని స్థానికులు కోరారు.
- రావిర్యాల పెద్ద చెరువు: మట్టితో నింపేసి అక్రమ లేఅవుట్లు వేస్తున్న రావిర్యాల పెద్ద చెరువు హద్దులను (ఎఫ్టీఎల్, బఫర్ జోన్) నిర్ధారించి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు.
- సాయిబాబానగర్ రోడ్డు ఆక్రమణ: కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్, కృషికాలనీలో రహదారిని ఆక్రమించి, విద్యుత్ స్తంభాన్ని తొలగించి భవనం నిర్మిస్తున్నారని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. హైకోర్టు ఈ అనుమతులను రద్దు చేసినప్పటికీ నిర్మాణాలు సాగిస్తున్నారని ఆరోపించారు.
- మచ్చబొల్లారం స్థలానికి రక్షణ: సికింద్రాబాద్ మచ్చబొల్లారం జొన్నబండ సర్వే నంబర్లు 33, 34లోని శ్రీ గణేష్ ఎన్‌క్లేవ్‌లో ప్రజావసరాల కోసం కేటాయించిన 1800 గజాల స్థలాన్ని యజమాని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు.
- బతుకమ్మకుంట అభివృద్ధిపై హర్షం: బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను అభివృద్ధి చేసి వరద ముప్పు తప్పించినందుకు గాయత్రి టవర్స్ నివాసితులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. మూసీకి నీరు చేరేలా పైప్‌లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.
- కూకట్పల్లి దయారగూడ స్థలం: కూకట్పల్లి దయారగూడలోని హుడా లేఅవుట్లో మిగిలిన 800 గజాల ఖాళీ స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడి, ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు కేటాయించాలని స్థానికులు కోరారు.



