Friday, July 31, 2026
Google search engine
Homeతెలంగాణ*నాణ్యమైన విద్యే అసలైన పెట్టుబడి: సీ.ఎం రేవంత్‌రెడ్డి,

*నాణ్యమైన విద్యే అసలైన పెట్టుబడి: సీ.ఎం రేవంత్‌రెడ్డి,

  • *మండలమే యూనిట్‌గా విద్యా ప్రణాళికలు రూపొందించాలి
  • *ప్రతి పేద విద్యార్థిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి
  • *ఏటా 10-15 మంది ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ
  • *సమాజ మార్పు కోసమే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నా

*హైదరాబాద్:

నాణ్యమైన విద్య రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అయితే, నైపుణ్యాలు దానిపై నిర్మించే అంతస్తుల లాంటివని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు దృఢమైన దీక్షబూನాలని పిలుపునిచ్చారు. ‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్’ కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి తిరిగి వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు.

*విద్యపై పెట్టుబడి – ప్రైవేట్ బడుల వైపు చూపు
రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.08 లక్షలు వెచ్చిస్తున్నామని, ప్రభుత్వాలు ఖర్చు చేసే ఈ మొత్తాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని సీఎం అన్నారు. అంత భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పట్టడానికి కారణమేంటో ఉపాధ్యాయులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదని, విద్య లేకపోవడమే అసలైన వెనుకబాటుతనమని తాజా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి కుల సర్వే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఏ ఆస్తులు లేకపోయినా చదువు ద్వారా ఉద్యోగాలు సాధించినవారే నేడు ప్రపంచంతో విజయవంతంగా పోటీపడుతున్నారని చెప్పారు.

*విదేశీ విద్యకు ఉపాధ్యాయులు.. మండలమే యూనిట్‌గా ప్రణాళికలు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మాదిరిగానే ప్రతి ఏటా 10 నుంచి 15 మంది ఉపాధ్యాయులను విదేశీ విద్యకు పంపిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. విదేశాల్లో వారు ఆర్జించిన జ్ఞానాన్ని ఇక్కడి విద్యార్థులకు పంచాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలపైనే కాకుండా, విద్యార్థుల అభ్యున్నతి కోసం తనతో కొట్లాడాలని కోరారు.
ప్రతి ఉపాధ్యాయుడు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాబోయే విద్యా సంవత్సరానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ మండలంలోని బడులకు కావాల్సిన వసతులు, ఉపాధ్యాయుల కొరత, మెరుగైన బోధనకు తీసుకోవాల్సిన చర్యలపై డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి, జిల్లాల వారీగా వచ్చే సలహాలు, సూచనలను అందులో పొందుపరుస్తామని వెల్లడించారు.

*సాంప్రదాయ విద్యకు కాలం చెల్లింది – నైపుణ్యమే జీవనోపాధి
ఇంగ్లీష్ కేవలం భావప్రసారానికి ఉపయోగపడే ఒక భాష మాత్రమేనని, కానీ నైపుణ్యమే యువతకు అసలైన జీవనోపాధి కల్పిస్తుందని సీఎం ఉద్ఘాటించారు. జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు పది శాతం మించకపోయినా, వారిలోని అసాధారణ నైపుణ్యాలతోనే ప్రపంచాన్ని శాసిస్తున్నారని ఉదాహరణగా చెప్పారు. ఆయా దేశాల భాషలు నేర్చుకుని, నైపుణ్యాలు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న నిరక్షరాస్యత, కరవు కాటకాలను అధిగమించడానికి ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. ఆయన దార్శనికతతోనే ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయ కోర్సులతో వెనుకబడిన ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మార్చామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు.

*రాజీనామాల డిమాండ్‌పై స్పష్టత
ప్రతి పేద విద్యార్థిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాలనేదే తన ధ్యేయమని స్పష్టం చేసిన సీఎం, తన రాజీనామా కోరుతున్న ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందిస్తున్నందుకా? 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి బదిలీలు చేపట్టినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసినందుకా? ఎందుకు రాజీనామా చేయాలో విమర్శకులు సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. తాను ఓట్ల కోసం, రాజకీయ లబ్ది కోసం పనిచేయడం లేదని, సమాజంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికే విద్యాశాఖ బాధ్యతలు చేపట్టానని స్పష్టం చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తెలంగాణను దేశానికే విద్యా రంగానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments