Wednesday, November 18, 2026
Google search engine
Homeతెలంగాణపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

  • అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం.
  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3,149 మందికి కొత్త పింఛన్లు..
  • 1,080 మందికి మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి :

పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పీఏసీ చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. చేయూత పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అభాగ్యుల జీవితాలకు భరోసా కల్పించే గొప్ప సంక్షేమ పథకమని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ చెరువు సమీపంలో ఉన్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలోమంగళవారం నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డీసీ ఇస్లావత్ సేవా, యాదవ కోఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని 1,080 మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే లక్ష్యంతో అర్హులైన వారికి చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకు, భర్తను కోల్పోయిన మహిళలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఈ పింఛన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పింఛన్ల ద్వారా లబ్ధిదారులు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం 3,149 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయని, ఇందులో శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో 1,080 మంది, చందానగర్ సర్కిల్ పరిధిలో 957 మంది, ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో 1,112 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. మొదటి విడతలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు పింఛన్లు మంజూరైనట్లు చెప్పారు. అర్హులైన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజా ప్రతినిధులుగా వారికి అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments