- సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభించిన డిజిపి సి. వి.ఆనంద్
- పౌరుల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక కేంద్రం
- నేర పరిశోధనలో ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ యాప్‌లు
- భరోసా కేంద్రాల సేవలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్
- జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘాకు వ్యవస్థ
హైదరాబాద్:
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించే దిశగా తెలంగాణ పోలీసు శాఖ మరో కీలక అడుగు వేసింది. నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు నూతన డిజిటల్ సేవలను డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ డీజీపీ కార్యాలయంలో శోధించి ప్రారంభించారు. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించడం, ఆధారాల సేకరణలో శాస్త్రీయ పద్ధతులను పెంచడం ఈ ఆవిష్కరణల ముఖ్య ఉద్దేశం.
పౌరుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేక కేంద్రం (సీఎఫ్ సీ)
పోలీసు సేవల నాణ్యతను నేరుగా ప్రజల నుంచే తెలుసుకునేందుకు ‘సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్’ ఏర్పాటైంది. పిటిషన్లు, ఎఫ్ఐఆర్ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వంటి సేవలు పొందిన పౌరుల స్పందనను ఈ కేంద్రం ద్వారా నిరంతరం సేకరిస్తారు. ఇది పోలీసు సేవల్లో పారదర్శకతను పెంపొందించడానికి దోహదపడుతుంది.
‘భరోసా’ కేంద్రాలకు సమగ్ర డిజిటల్ వేదిక:
మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సాంకేతిక వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 భరోసా కేంద్రాలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చారు. బాధితులకు అందించే వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవల వివరాల నమోదుతో పాటు కేసు ప్రారంభం నుండి ముగింపు వరకు పర్యవేక్షించే వీలుకలుగుతుంది. కాగితపు రిజిస్టర్ల స్థానంలో డిజిటల్ డాష్‌బోర్డులు, 23 రకాల సమాచార నివేదికలు అందుబాటులోకి వచ్చాయి.
*సమాచార వికేంద్రీకరణకు సీఐడీ వెబ్‌సైట్:
సీఐడీ కార్యకలాపాలు, రక్షణ సంబంధిత సమాచారాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి https://cid.tspolice.gov.in/ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
జైలు విడుదలైన ఖైదీలపై నిరంతర నిఘా:
జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల సమాచారాన్ని తక్షణమే పోలీసులకు చేరవేసేందుకు ‘జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్’ రూపుదిద్దుకుంది. దీని ద్వారా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ-ప్రిజన్స్ వ్యవస్థను, నేరాల నమోదు నెట్‌వర్క్ వ్యవస్థ (సీసీటీఎన్ఎస్)తో అనుసంధానించారు. ఖైదీల విడుదల వివరాలు ఎస్‌ఎంఎస్ ద్వారా సంబంధిత పోలీసు స్టేషన్లకు చేరుతాయి. కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణ ద్వారా నేర నెట్‌వర్క్‌లను గుర్తించడం, ముందస్తు నిఘాను బలోపేతం చేయడం దీనితో సులభతరమవుతుంది.
*15 సెకన్లలో ముఖ గుర్తింపు (ఫేస్ సెర్చ్):
సుమారు 9.8 లక్షలకు పైగా ఫొటోలతో కూడిన డిజిటల్ దత్తాంశంతో మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్‌ను రూపొందించారు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ముఖాలను పోల్చి చూపే సామర్థ్యం దీని సొంతం. అనుమానితులు, అపరిచిత మృతదేహాలు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ కృత్రిమ మేధ పరిజ్ఞానం అత్యంత కీలకంగా మారనుంది.
క్షేత్రస్థాయిలోనే వేలిముద్రల పరిశీలన:
నేర స్థలంలో లభించే వేలిముద్రలను ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా సేకరించి, తక్షణమే రాష్ట్ర కేంద్ర సర్వర్‌కు పంపేలా ‘క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. బయోమెట్రిక్ సరిపోలిక సాంకేతికత ద్వారా సర్వర్ నుండి వేగంగా సమాచారం లభించి, నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ఆధారాలు లభిస్తాయి. దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న విధానాన్ని తెలంగాణ పోలీసు శాఖ అమలులోకి తెచ్చింది.
దర్యాప్తు అధికారులకు ప్రామాణిక మార్గదర్శకాలు:
నేర పరిశోధనలో శాస్త్రీయ నాణ్యతను పెంచేందుకు ఐదు సంపుటాలతో కూడిన ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీలు) ఆవిష్కరించారు. శరీర సంబంధ నేరాలు, ఆస్తి నష్టం నేరాలు, మహిళలు-పిల్లలపై నేరాలు, ప్రత్యేక చట్టాల కింద నమోదయ్యే కేసులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి. ఇవి న్యాయస్థానాల్లో నేర నిరూపణ శాతాన్ని పెంచడానికి, చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి తోడ్పడతాయి.
సాంకేతిక పరిజ్ఞానం, ప్రామాణిక దర్యాప్తు సూత్రాల కలయికతో రాష్ట్రంలో నేర నియంత్రణ, పరిశోధన వ్యవస్థ మరింత శక్తివంతమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, సీఐడీ డీజీ చారు సిన్హా, అదనపు డీజీ ఆకాన్ సబర్వాల్, ఐజీ గజరావు భూపాల్, డీఐజీలు నారాయణ నాయక్, పరిమళ హన నూతన్, ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, రూపేష్, ప్రవీణ్ కుమార్, మల్లారెడ్డి, బాలకోటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



