Tuesday, September 22, 2026
Google search engine
Homeతెలంగాణబతుకమ్మ కళా వైభవానికి నీరాజనం.. ఉత్సాహంగా 'యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్'!

బతుకమ్మ కళా వైభవానికి నీరాజనం.. ఉత్సాహంగా ‘యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్’!

అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు.. జ్యూరీ కమిటీ కీలక నిర్ణయం

హైదరాబాద్:

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, ఆడపడుచుల ఆత్మగౌరవ వేడుక అయిన బతుకమ్మ సంబురాలను దృశ్యరూపంలో ప్రపంచానికి చాటిచెప్పే దిశగా ప్రభుత్వం చేపట్టిన ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్’కు యువత నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఔత్సాహిక చిత్ర నిర్మాతల విజ్ఞప్తుల మేరకు, ఈ ప్రతిష్టాత్మక పోటీలో పాల్గొనే తుది గడువును అక్టోబర్ 2 వరకు పొడిగిస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం నాడు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం వెలువడింది. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించి, పోటీల విధివిధానాలపై సమీక్ష జరిపారు.

“యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసి, నూతన దర్శకులకు బంగారు బాటలు వేయడమే ఈ ఛాలెంజ్ ప్రధాన ఉద్దేశం. గడువు పెంపుతో మరింతమంది సృజనాత్మక కళాకారులు ఈ వేదికను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.”
— జ్యూరీ కమిటీ స్పష్టీకరణ

*కళారంగ ప్రముఖుల భాగస్వామ్యం
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, ఎఫ్‌డీసీ ఈడి కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ గాయకులు, కళాకారులు విమలక్క, గీత రచయిత కాసర్ల శ్యామ్, పొన్నం రవిచంద్ర, అనిల్ జీలా తదితర జ్యూరీ సభ్యులు పాల్గొని యువ ఫిలిం మేకర్స్‌ను ప్రోత్సహించే ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు.

*సంస్కృతి పరిరక్షణే ధ్యేయం
అణగారిన కళలను, అపురూప సాంస్కృతిక సంపదను దృశ్యకావ్యాలుగా మలచడంలో యువత చూపుతున్న ఉత్సాహం ప్రశంసనీయం. ఈ ఛాలెంజ్ ద్వారా మన సంస్కృతి మూలాలు మరింత లోతుగా సమాజంలోకి వెళ్తాయని, చారిత్రక శాస్త్రీయ ఆధారాలతో కూడిన కళాఖండాలు రూపుదిద్దుకుంటాయని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. అక్టోబర్ 2వ తేదీలోగా తమ లఘు చిత్రాలను సమర్పించాలని ఔత్సాహిక కళాకారులకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments