Home తెలంగాణ మున్సిపల్ పరిపాలనను పటిష్టం చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

మున్సిపల్ పరిపాలనను పటిష్టం చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

0
మున్సిపల్ పరిపాలనను పటిష్టం చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
అసెంబ్లీలో పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లుపై మాట్లాడుతున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

మున్సిపల్ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పౌరులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

జీహెచ్‌ఎంసీలో సేవల నాణ్యత పెంచేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే ప్రాథమికంగా గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు.

మూసీ నది అభివృద్ధి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, అయినా భారత రాష్ట్ర సమితి సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. మూసీ అభివృద్ధిపై సభ్యుల సూచనలు స్వీకరిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు.

హైదరాబాద్‌ వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. ప్రస్తుతం నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 174 పాయింట్లుగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో గాలి నాణ్యత మరింత దిగజారకుండా ఉండేందుకు నగర పరిధిలోని పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ అవతలకు తరలించే ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు.

రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని పేర్కొన్న మంత్రి.. హైదరాబాద్‌ను 360 డిగ్రీల పరిధిలో కవర్ చేసేలా మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. అనుమతులు, నిర్వహణలో సమస్యలు రాకుండా ఉండేందుకే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే తిరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

జీహెచ్‌ఎంసీలో వార్డుల సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని, ఇప్పటికే 8 మంది జోనల్ కమిషనర్లను నియమించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ పరిపాలన కోసం ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను కూడా నియమించామని చెప్పారు.

గత ప్రభుత్వం సిబ్బందిని నియమించకుండానే జిల్లాల సంఖ్యను 33కి పెంచిందని విమర్శించారు. 33 కలెక్టరేట్లు నిర్మించినప్పటికీ వాటిలో సిబ్బంది లేకపోయారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీ ద్వారా కలెక్టరేట్లలో సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరు ఉన్న పథకం నుంచి ఆయన పేరునే తొలగించారని మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here