*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై జెన్-జెడ్ ఉద్యమం.. ఛత్రపతి శివాజీ పోరాటంతో పోలిక
ముంబై :
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను నాటి మొఘలులు ఏ విధంగా అయితే ‘ఎలుక’గా కించపరిచారో, నేడు అదే రీతిలో ప్రస్తుత తరాన్ని ‘బొద్దింకలు’ అంటూ అవమానిస్తున్నారని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నేటి యువత (జెన్-జెడ్) చేపట్టిన పోరాటం.. నాటి యువ శివాజీ సాహసాన్ని తలపిస్తోందని ఆయన కొనియాడారు. ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
*యువత పోరాటాన్ని శివాజీ సాహసంతో బేరీజు
ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ముప్పై ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే ఈ వ్యవస్థపై తిరుగుబాటు జెండా ఎెగరేసిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు మనం ‘జెన్-జెడ్’ (Gen-Z)గా పిలుస్తున్న 13 నుంచి 28 సంవత్సరాల వయసు గల యువతీయువకులను కొందరు నీచంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా సరిగ్గా ఇదే వయసులో తోర్నా కోటను స్వాధీనం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఆనాడు మొఘలులు శివాజీని ‘ఎలుక’ అని పిలిచి చిన్నచూపు చూశారు. అలాగే, సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ‘జ్ఞానేశ్వరి’ గ్రంథాన్ని రచించినప్పుడు ఆయన వయసు కూడా చాలా చిన్నదే. ఆ మహనీయులందరూ తమ కాలంలో తీవ్ర వ్యతిరేకతను, అడ్డంకులను ఎదుర్కొంటూనే విజయం సాధించారు”
అని ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు.
*బీజేపీపై నిప్పులు చెరిగిన ఉద్ధవ్
తాను అధికార రాజకీయాల కోసం మతాన్ని ఎప్పుడూ వాడుకోలేదని, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను స్పష్టం చేస్తూ ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మానవత్వమే అసలైన మతం’ అని బాలాసాహెబ్ తన ప్రసంగాల్లో తరచూ చెప్పేవారని గుర్తుచేశారు. ఒకవేళ ఆయన గనుక నేడు జీవించి ఉంటే, ఈ ప్రస్తుత పాలకులే ఆయన్ని ‘హిందూ వ్యతిరేకి’గా ముద్ర వేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం మతాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న పాలకుల నైతికతను ఆయన ప్రశ్నించారు. “ఏ శ్రీరాముడి పేరు చెప్పుకుని మీరు అధికారంలోకి వచ్చారో, నేడు అదే శ్రీరాముడి పేరిట నిర్మించిన ఆలయంలోనూ దోపిడీకి పాల్పడటానికి మీకు సిగ్గు అనిపించడం లేదా?” అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఠాక్రే కుటుంబంపై నిజాలు రాసేందుకు ఎంతో గుండెధైర్యం కావాలని ఆయన అన్నారు.



