• పెండింగ్ ప్రమోషన్లపై డిజిపి సి. వి. ఆనంద్ ప్రత్యేక చొరవ
• కోర్టు వివాదాలకు స్వస్తి.. అధికారుల మధ్య ఏకాభిప్రాయం
• తొలి విడతలో 54 డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి, 2027 ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు
• 12 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి, ప్యానల్ ఇయర్లో మరో 10 నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి
• 1991, 1995, 1996 బ్యాచ్‌లకు ప్రమోషన్ ప్యానళ్లు సిద్ధం
• అధికారుల ఏకాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్న డిజిపి సి. వి. ఆనంద్
హైదరాబాద్
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతుల సమస్యకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. సీనియారిటీ వివాదాలు, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ (ఆర్ఓఆర్), ఖాళీలు, అర్హతలపై నెలకొన్న విభేదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు డిజిపి సి. వి. ఆనంద్ చొరవ తీసుకున్నారు. న్యాయస్థానాల్లో కేసులు, వివాదాల కారణంగా అర్హులైన అధికారులు పదోన్నతులు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. ఈ మేరకు మంగళవారం డిజిపి కార్యాలయంలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సివిల్ ఎస్సైలతో ఆయన సమావేశమయ్యారు. వరంగల్, హైదరాబాద్ రేంజ్‌లతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారు. పదోన్నతుల ప్రక్రియలో ఎదురవుతున్న అభ్యంతరాలు, సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, ఖాళీలు, అర్హతలపై చర్చించారు.
తొలిదశలో 54 అదనపు ఎస్పీ పోస్టులు
డీఎస్పీ స్థాయి అధికారులకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు మొత్తం 54 పోస్టులు తొలిదశలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. రెండో దశలో 2027 ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు 1991, 1995, 1996 బ్యాచ్‌లకు సంబంధించి పదోన్నతి ప్యానళ్లను సిద్ధం చేశారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 74 ప్రకారం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, సీనియారిటీపై కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాలు తలెత్తాయి. కమిటీ నివేదిక, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలను ప్రస్తుత సమావేశంలో సమీక్షించారు.

12 ఎస్పీ (నాన్ క్యాడర్) పోస్టుల పదోన్నతులకి చర్యలు
ప్రస్తుతం 12 నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టుల విషయంలో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులు లేనందున వాటిని తక్షణమే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు ప్యానల్ ఇయర్లో మరో 10 నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టులు కేటాయించనున్నట్లు వివరించారు.
ఏకాభిప్రాయానికి అధికారుల సమ్మతి
అందుబాటులో ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హులైన అధికారుల వివరాలను డిజిపి కార్యాలయ అధికారులు సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సర్వీసు కాలం, సీనియారిటీ, రోస్టర్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తొలిదశ, రెండో దశ పదోన్నతి జాబితాలను రూపొందించారు. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అధికారులకు అవకాశం కల్పించారు. ప్రతిపాదిత జాబితాల ప్రకారం ముందుకు వెళ్లేందుకు అధికారులు అంగీకారం తెలిపారు.
ముఖ్యమంత్రి దృష్టికి ఏకాభిప్రాయం
సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని డిజిపి సి. వి. ఆనంద్ తెలిపారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు దీర్ఘకాలం కొనసాగితే చివరకు అందరికీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పదవీ విరమణకు చేరువలో ఉన్న అధికారులు పదోన్నతి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అర్హులైన ప్రతి అధికారికి న్యాయం జరగాలన్నదే పోలీసు శాఖ ఉద్దేశమని, అదే సమయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారమే పదోన్నతులు కల్పిస్తామని డిజిపి స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించిన అధికారులు పదవీ విరమణకు ముందే పదోన్నతి పొందితే వారికి తగిన గుర్తింపు, సంతృప్తి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

డిజిపి చొరవతో అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం కావడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఈ సమావేశంలో డిజిపి సి. వి. ఆనంద్, మహిళా భద్రతా విభాగం డిజి సౌమ్య మిశ్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం. భగవత్, అదనపు డిజిలు (శాంతిభద్రతలు) ఆకున్ సబర్వాల్, (ఇంటెలిజెన్స్) విజయ్‌కుమార్, ఐజీలు షానవాజ్ ఖాసీం (పర్సనల్, మల్టీజోన్-2), కార్తికేయ (మల్టీజోన్-1), జాయింట్ డైరెక్టర్ రోడ్డు సేఫ్టీ జోయల్ డేవిస్, జాయింట్ పోలీస్ కమిషనర్ చందనా దీప్తి, డీఐజీ నారాయణ నాయక్, ఎల్ ఎస్ చౌహాన్ తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.


