- -రూ.10తో మూత్ర విసర్జన
- -పే అండ్ యూస్ పేరిట దోపిడీ
- -భోజనం కంటే మల, మూత్ర విసర్జన ఖరీదు
- -ఇప్పటికే రూ.100 కోట్ల ప్రజాధనం మట్టిపాలు -2,300 మరుగుదొడ్లలో పనిచేస్తున్నవి కేవలం 440 మాత్రమే
- -ప్రతి 30 వేల మందికి ఒక్కటే దిక్కు
- -బిల్లుల మంజూరులో ఉన్న శ్రద్ధ పర్యవేక్షణలో కరవు
- -మెట్రో నగరాల ర్యాంకింగ్ పోటీలలో దిగజారుతున్న హైదరాబాద్ మహానగరం
- -కేంద్ర నిబంధనలకు తూట్లు.. మహిళలు, చిరువ్యాపారులు, రోజువారీ కూలీలకు నరకయాతన..
విశ్వనగరంగా కీర్తిస్తున్న హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ‘ఇందిరమ్మ క్యాంటీన్’ భోజనం కంటే, కనీస మానవ అవసరమైన మూత్ర, మల విసర్జనలే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కేవలం రూ. 5 కే రుచికరమైన భోజనం అందిస్తూ సామాన్యుల కడుపు నింపుతుండగా, మరోవైపు ప్రజా మరుగుదొడ్ల వద్ద నిర్వాహకులు రూ. 5 నుండి రూ. 10 వరకు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా అవార్డులు, పురస్కారాలు దక్కించుకోవడానికి రూ. 100 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన ఉచిత మరుగుదొడ్లు నేడు అధికారుల నిర్లక్ష్యం, కమీషన్ల కక్కుర్తితో మూలకు చేరాయి.
(పరిశోధనాత్మక పాత్రికేయులు మీ.. వి.జీ)
హైదరాబాద్
హైదరాబాద్ మహానగరం పరిధిలో సామాన్య ప్రజలకు అవసరమైన ప్రజా మరుగుదొడ్ల నిర్వహణలో బల్దియా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో టాయిలెట్లు లేక, ఉన్నవి అపరిశుభ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు ‘పే అండ్ యూస్’ పేరుతో సులాబ్ కాంప్లెక్స్ నిర్వాహకులు అధిక రుసుము వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉచిత సదుపాయాలు కల్పించాల్సిన బల్దియా పర్యవేక్షణ కొరవడటంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది.

భోజనం కంటే మరుగుదొడ్ల ఖర్చే భారం:
రోజువారీ కూలీ పనుల కోసం, చిరు వ్యాపారాల నిమిత్తం నగరంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే లక్షలాది మంది శ్రామికులు రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తోంది. నగరంలోని ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, కూకట్పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, కోఠి వంటి రద్దీ కూడళ్లు, బస్ స్టాండ్లు, ఆసుపత్రులు, చివరకు ఇందిరమ్మ క్యాంటీన్ల సమీపంలోని మరుగుదొడ్లలో కూడా మూత్ర విసర్జనకు రూ. 5, మల విసర్జనకు రూ. 10 చొప్పున నిర్వాహకులు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో మూడు పూటలా తిన్నా రూ. 15 మించని ఖర్చు, మరుగుదొడ్ల వినియోగానికి మాత్రం రోజుకు రూ. 20 నుండి రూ. 30 వరకు భారమవుతోందని కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేని నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కన బహిరంగ విసర్జనకు పాల్పడుతుండటంతో నగర పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది.
కాగితాలపై గణాంకాలు.. క్షేత్రస్థాయిలో శూన్యం:
నగరంలో ఉచిత మరుగుదొడ్ల పథకం వైఫల్యానికి గణాంకాలే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నగరవ్యాప్తంగా సుమారు 2,300కు పైగా ఆధునిక కంటైనర్ మరుగుదొడ్లు, మహిళల ప్రత్యేక మరుగుదొడ్లు, ఎలక్ట్రానిక్ మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు కాగితాలపై గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో వీటిలో కేవలం 440 మరుగుదొడ్లు మాత్రమే ప్రస్తుతం వాడుకలో ఉన్నట్లు తేలింది. అంటే కోటికి పైగా జనాభా ఉన్న మహానగరంలో సగటున ప్రతి 30 వేల మందికి కేవలం ఒక్క మరుగుదొడ్డి మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన దాదాపు 1,860 మరుగుదొడ్లు నీటి కనెక్షన్లు లేక, విద్యుత్ సరఫరా నిలిచిపోయి, భూగర్భ మురుగునీటి వ్యవస్థకు అనుసంధానం కాక, తలుపులు విరిగిపోయి చెత్తాచెదారంతో నిండిపోయాయి. రాత్రి వేళల్లో వీటి వద్ద వెలుతురు, భద్రత లేకపోవడంతో మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి.

ప్రకటనల ఆదాయంపైనే అధికారుల కన్ను:
మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారులు, ఆ తర్వాత వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిర్వాహకులకు నెలవారీ నిర్వహణ బిల్లులు మంజూరు చేయడంలో చూపుతున్న శ్రద్ధ, క్షేత్రస్థాయిలో అవి పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేయడంలో చూపడం లేదు. కంటైనర్ మరుగుదొడ్ల గోడలపై వ్యాపార ప్రకటనల బోర్డుల ద్వారా నిర్వాహకులు, కొందరు అధికారులు లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారే తప్ప, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలనే కనీస బాధ్యతను విస్మరించారు. ఉచితం అని బోర్డులు ఉన్న చోట్ల కూడా సిబ్బంది ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
కేంద్ర నిబంధనలు ఏం చెబుతున్నాయి?:
కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన స్వచ్ఛ భారత్ పట్టణ నిబంధనల ప్రకారం, ప్రతి మెట్రో నగరంలో 500 మీటర్ల నుండి ఒక కిలోమీటరు దూరంలో ఒక ప్రజా మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. అన్ని ప్రభుత్వ, మున్సిపల్ మరుగుదొడ్లలో మూత్ర విసర్జన పూర్తిగా ఉచితంగా ఉండాలి. ప్రతి మరుగుదొడ్డి వద్ద ఒక సంరక్షకుడు ఉండి, ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేయాలి. అంతేకాకుండా, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని పెట్రోల్ బంకులలో ఉండే మరుగుదొడ్లను సామాన్య ప్రజలు ఎటువంటి ఇంధనం కొనుగోలు చేయకపోయినా ఉచితంగా ఉపయోగించుకునే హక్కు ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా అత్యవసర సమయాల్లో మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు ఉచితంగా మరుగుదొడ్లు వాడుకునేలా నగరపాలక సంస్థ గతంలో ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా అమలు కావడం లేదు.
మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం:
ప్రజా మరుగుదొడ్ల కొరత, అపరిశుభ్రత కారణంగా మహిళా ప్రయాణికులు, వీధి వ్యాపారులు, వృద్ధులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. బయటకు వెళ్లిన సమయంలో మరుగుదొడ్లు అందుబాటులో లేక గంటల తరబడి మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల మహిళల్లో మూత్రపిండాల సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తీవ్రంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో చాలా వరకు తాళాలు వేసి ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు అవసరం:
రూ. 5 కే ఆకలి తీర్చే భోజనాన్ని అందిస్తున్న తరహాలోనే, కనీస అవసరమైన మూత్ర విసర్జనను నగరంలోని అన్ని మరుగుదొడ్లలో పూర్తిగా ఉచితం చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రధాన బస్ స్టాండ్ల వద్ద ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సర్కిల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహక సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. పెట్రోల్ బంకులు, హోటళ్లలో ఉచిత మరుగుదొడ్ల నిబంధనను కఠినంగా అమలు చేసి, ప్రజా భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వనగర ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుంది.



