Thursday, October 1, 2026
Google search engine
Homeతెలంగాణరొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు గవర్నర్ చేయూత

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు గవర్నర్ చేయూత

  • అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా లోక్ భవన్‌ గులాబీమయం
  • ముందస్తు గుర్తింపుతోనే ప్రాణరక్షణ : రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్‌:

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించి, ముందస్తు గుర్తింపు ద్వారా మహిళల ప్రాణాలను కాపాడాలన్న సంకల్పానికి రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా మద్దతుగా నిలిచారు.
అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ చేపట్టిన 18వ ‘పెయింట్‌ ది సిటీ పింక్‌’ ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి లోక్ భవన్‌ గులాబీ కాంతులతో వెలిగింది.

ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ పి.రఘురామ్‌తో కలిసి గవర్నర్‌ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. రొమ్ము ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు, వ్యాధిని ముందుగానే గుర్తించేలా మహిళలను చైతన్యపరిచేందుకు డాక్టర్‌ రఘురామ్‌ చేస్తున్న విశేష కృషిని ప్రశంసించారు.

లోక్ భవన్‌ వరుసగా ఏడో ఏడాది ఈ ప్రచారంలో భాగస్వామ్యం కావడం విశేషం.
చార్మినార్‌, బుద్ధ విగ్రహం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల, ప్రసాద్స్‌ ఐమాక్స్‌, టీ-హబ్‌, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, కిమ్స్‌ ఆసుపత్రి సహా హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రముఖ కట్టడాలు గులాబీ వెలుగులతో మెరిశాయి.

“పెయింట్‌ ది సిటీ పింక్‌’ కేవలం భవనాలను వెలిగించడం కాదు.. ఆశ, ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్‌పై మౌనాన్ని వీడి, ముందస్తు గుర్తింపుతో ప్రాణాలను కాపాడాలనే సందేశాన్ని చాటడం” అని గవర్నర్‌ శ్రీ శివ్‌ ప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు.

ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ డాక్టర్ పి. రఘు రామ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే హైదరాబాద్ మాత్రమే వరుసగా 18 సంవత్సరాలుగా ఒకే రాత్రి ఇన్ని చారిత్రక కట్టడాలు, ప్రముఖ భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం అని పేర్కొన్నారు.

అవగాహనే రక్షణ కవచం
2009లో ప్రారంభమైన ‘పెయింట్‌ ది సిటీ పింక్‌’ ప్రచారం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ఉన్న భయాలు, అపోహలను తొలగించి, ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రొమ్ములో ఏదైనా కొత్త మార్పు కనిపించినా, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు గుర్తింపుతో చికిత్స ఫలితాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాణాలను కాపాడే అవకాశం కూడా పెరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments