Wednesday, November 18, 2026
Google search engine
Homeతెలంగాణవికసిత్‌ భారత్‌–2047 నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

వికసిత్‌ భారత్‌–2047 నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

  • భిన్నత్వం, వైవిధ్యమే భారత్ బలం
  • ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఏక్‌ భారత్‌–శ్రేష్ఠ భారత్‌’తో జాతీయ సమైక్యత, సాంస్కృతిక సమన్వయం
  • -ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌

హైదరాబాద్‌

వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనలో ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, వనరులు, ప్రతిభతో భాగస్వామి కావాలని తెలంగాణ గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ‘ఏక్‌ భారత్‌–శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం లోక్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
హిమాలయాల ఒడిలోని ఉత్తరాఖండ్‌ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిందని, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ వంటి పుణ్యక్షేత్రాలు దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉత్తరాఖండ్‌ ప్రజలు చేసిన పోరాటం, దేశ రక్షణలో గఢ్వాల్‌, కుమావోన్‌ రెజిమెంట్ల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జార్ఖండ్‌ గిరిజన సంస్కృతి, ఖనిజ సంపద, పారిశ్రామిక ప్రగతికి ప్రసిద్ధి చెందిందని గవర్నర్‌ అన్నారు. భగవాన్‌ బిర్సా ముండా గిరిజన హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన వీరుడు కొమురం భీమ్‌ పోరాటం కూడా ఇదే స్ఫూర్తిని చాటుతుందని అన్నారు.
తెలంగాణ, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల మధ్య పర్యాటకం, వ్యవసాయం, గిరిజన సంక్షేమం, హస్తకళలు, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ సదుపాయాలు కల్పించి, వారి జీవనోపాధిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు భారతదేశానికి బలమని, వాటి మధ్య పరస్పర గౌరవం, సోదరభావం జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తాయని గవర్నర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ ప్రజలు తెలంగాణ సమాజంలో భాగస్వాములవుతూ మూడు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.

ఆయా రాష్ట్రాల గవర్నర్ ల సందేశాలను డిజిటల్ స్క్రీన్ ల పై ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే జుమా, గఢ్వాలి, సంతాలి, చోలియా నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. దాన కిషోర్‌, సంయుక్త కార్యదర్శి శ్రీ కొమండూరు శశికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments