Thursday, July 30, 2026
Google search engine
Homeతెలంగాణ*సంక్షేమ పథకాలకు ఓటరు సవరణకు సంబంధం లేదు: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్...

*సంక్షేమ పథకాలకు ఓటరు సవరణకు సంబంధం లేదు: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

  • ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఉన్నత స్థాయి సమీక్ష.
  • ఆగస్టు మూడో తేదీలోగా డిజిటలైజేషన్ వంద శాతం పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు.
  • పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు హెచ్చరిక.

*హైదరాబాద్:

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం తప్పులు లేని నూతన ఓటరు జాబితాను రూపొందించడమే ఈ ప్రక్రియ ఏకైక ఉద్దేశమని ఆయన తేల్చిచెప్పారు.
బుధవారం నాడు రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులు మరియు కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, డిజిటలైజేషన్ తీరుతెన్నులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉన్నందున, ఆగస్టు మూడో తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

*గ్రామీణ ప్రాంతాల్లో ముందంజ – పట్టణాలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈవో వెల్లడించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం వరకు పనులు ముగిశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హుజూర్ నగర్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భోదన్ నియోజకవర్గాల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి కావడంపై సంబంధిత అధికారులను ఆయన అభినందించారు.
అయితే, శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

*నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసే సమయంలో ఓటర్ల పేర్లలో ఎలాంటి తప్పులు దొర్లకుండా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ), సూపర్ వైజర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఈవో హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు (ఈఆర్ఓ, ఏఈఆర్ఓ) ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను పర్యవేక్షించి తప్పుల్లేని జాబితా తయారీకి కృషి చేయాలన్నారు. డిజిటలైజేషన్‌లో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

*రాజకీయ పార్టీల భాగస్వామ్యం – పారదర్శకత
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈవో సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితాలో మృతి చెందినవారు, శాశ్వతంగా ఇళ్లు మారినవారు, అందుబాటులో లేని వారి (ఏఎస్డీ) వివరాల జాబితాను సిద్ధం చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధుల (బీఎల్ఏ) సంతకాలను విధిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓ స్థాయిల్లో నిర్వహించే అఖిలపక్ష సమావేశాలను తప్పనిసరిగా వీడియోగ్రాఫ్ చేసి పత్రబద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, వీఐపీ, వీవీఐపీ ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి మ్యాపింగ్ చేయాలని సూచించారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, పీఎం ఐటీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments