చైతన్యపురి చౌరస్తా నుంచి రంగారెడ్డి కోర్టు వరకు ఆటో ట్రాలీ వ్యాపారుల ఇష్టారాజ్యం
ఎల్బీనగర్:
చైతన్యపురి చౌరస్తా నుంచి రంగారెడ్డి కోర్టు వరకు ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లు, చివరకు మెట్రో రైల్ పార్కింగ్ స్థలాన్ని సైతం ఆటో ట్రాలీ వ్యాపారులు ఆక్రమించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా రహదారులపై ఆటో ట్రాలీలను నిలిపి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతోంది. నిత్యం వేలాది మంది వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు ట్రాఫిక్ వ్యవస్థపై సరైన అవగాహన లేని అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే రహదారులన్నీ వ్యాపారుల ఆక్రమణలకు గురవుతాయనడానికి ఈ ఆటో ట్రాలీ వ్యాపారుల వ్యవహారమే నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారులు వాహనాల రాకపోకల కోసం ఉన్నాయా? లేక వ్యాపారాలు నిర్వహించుకోవడానికా? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనదారులపై జరిమానాలు విధించేందుకు సమయం కేటాయిస్తున్న పోలీసులు, రహదారులను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆటో ట్రాలీ వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలు రహదారులపై సాఫీగా ప్రయాణించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ట్రాఫిక్ ఉన్నతాధికారులు స్పందించి చైతన్యపురి నుంచి రంగారెడ్డి కోర్టు వరకు రహదారులు, సర్వీస్ రోడ్లు, మెట్రో పార్కింగ్ స్థలాల ఆక్రమణలను తొలగించి, ఆటో ట్రాలీ వ్యాపారాల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.



