Wednesday, September 23, 2026
Google search engine
Homeతెలంగాణఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కావొద్దు

ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కావొద్దు

  • స్కాలర్‌షిప్‌ను జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా చూడాలి
  • నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా..
  • ఆకలి కేకలు, పేదరికం సంకెళ్లను తెంచుకుని విద్యా శిఖరాలను అధిరోహించడమే విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలి!

హైదరాబాద్‌:

జ్ఞాన సముపార్జనకు పేదరికం ఏమాత్రం అడ్డుగోడ కాకూడదని, ప్రతిభ ఒక్కటే విద్యార్థుల జీవితాన్ని శాసించే శక్తిగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గర్జించారు. లోక్‌భవన్‌లో మహామన మాలవీయ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన మహామన శిక్షా సేవా ప్రకల్ప్ కార్యక్రమంలో ఆయన తీవ్ర ఉద్వేగంతో ప్రసంగించారు. ఆర్థికాభావంతో అల్లాడుతున్న 28 మంది నిరుపేద విద్యార్థులకు రూ.5 లక్షల స్కాలర్‌షిప్‌ చెక్కులను స్వయంగా అందజేసి, వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారు.

*మాలవీయ ఆశయాల సాధనే ధ్యేయం
భారతరత్న పండిట్ మదన్ మోహన్ మాలవీయ జీవితాన్ని ఉదాహరణగా చూపుతూ.. పరిమిత వనరులున్నా అంతులేని సంకల్పబలంతో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని గవర్నర్ పిలుపునిచ్చారు. దాతలు అందించే ఈ ఆర్థిక సహాయాన్ని కేవలం డబ్బుగా చూడకుండా, తమ తలరాతను మార్చుకునే మహత్తర అవకాశంగా భావించి ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. దేశ నిర్మాణంలో యువత పాత్రే అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

*మాదకద్రవ్యాల మహమ్మారిపై యుద్ధభేరి
యువతను నిలువునా దహించివేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) సంస్కృతిపై గవర్నర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ భూతం కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే కాకుండా, కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. ఈ వ్యసనాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగకుండా దేశహితమే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

*దేశమే ప్రథమం – సామాజిక బాధ్యత:
‘దేశమే ప్రథమం’ అనే దృఢమైన జాతీయ భావన ప్రతి ఒక్కరిలోనూ నరనరాల జీర్ణించుకోవాలని గవర్నర్ ఉద్ఘాటించారు. సమాజంలో వేళ్లూనుకున్న సమస్యలను నిర్మూలించడానికి యువత ఐక్యంగా పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, మహామన మాలవీయ మిషన్ అధ్యక్షుడు శ్రీ పి.సి. జైన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు సంపూర్ణ అండగా నిలుస్తామని శపథం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments