- ముమ్మర తనిఖీలకు సిద్ధమవుతున్న హైడ్రా
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని కమిషనర్ హెచ్చరిక
- చెరువుల పునరుద్ధరణ, నీటి ఎద్దడి నివారణే లక్ష్యంగా కార్యాచరణ
హైదరాబాద్:
నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి నిర్వాహకులకు ఒక నెల గడువు ఇస్తున్నట్లు హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు.
నిబంధనల ప్రకారం శుద్ధి కేంద్రాల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని సూచించారు. నెల గడువు ముగిసిన తర్వాత హైడ్రా నేతృత్వంలో జలమండలి, నగరపాలక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం హైడ్రా కార్యాలయంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు, నివాస సముదాయాల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆక్రమణలకు గురై మురికి కూపాలుగా మారిన నగర చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తోంది. చెరువుల్లోకి నేరుగా మురుగునీరు చేరి కలుషితం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడుతోంది. శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేసిన నీటిని మాత్రమే చెరువుల్లోకి వదిలేలా ఏర్పాట్లు చేస్తోంది. శుద్ధి చేయని మురుగునీరు చెరువుల్లో కలవడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు మరణించడంతో పాటు భూగర్భ జలాలు సైతం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గి నగరంలో నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుద్ధి చేసిన నీటిని తాగునీటి అవసరాలకు కాకుండా, ఉద్యానవనాలు, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర గృహేతర అవసరాలకు పెద్ద ఎత్తున వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించినందున వీటి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ వివరించారు.
శుద్ధి కేంద్రాలు నిరంతరం పనిచేయాలి
నివాస సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లోని ప్రైవేట్ మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిరంతరం పనిచేయాలని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను జలమండలి అధికారిక వేదికపై తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. శుద్ధి కేంద్రాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా విద్యుత్ మీటరును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలోకి వచ్చే మురుగునీరు, శుద్ధి తర్వాత బయటకు వెళ్లే నీటి పరిమాణం, విద్యుత్ వినియోగం, నీటి పునర్వినియోగ వివరాలను రోజువారీగా నమోదు చేసి, ప్రతి నెలా జలమండలికి సమర్పించాలని ఆదేశించారు. నివాస సముదాయాల నిర్వాహకులు తమ అవసరాలకు సరిపడా నీటిని మాత్రమే శుద్ధి చేసుకుని, మిగిలిన మురుగునీటిని నేరుగా కాలువల్లోకి వదిలేయకూడదని హెచ్చరించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున, శుద్ధి చేసిన తర్వాత మిగులు నీరు ఉంటే ఆ వివరాలను జలమండలికి తెలియజేయాలన్నారు. తద్వారా ఆ నీటిని జలమండలి ద్వారా లేదా పరస్పర అంగీకారంతో సమీపంలోని అవసరమైన వారికి సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు.



