Monday, September 21, 2026
Google search engine
Homeతెలంగాణదళితుల అంగుళం భూమి కూడా ముట్టుకోం: పొంగులేటి.

దళితుల అంగుళం భూమి కూడా ముట్టుకోం: పొంగులేటి.

  • ఇందిరమ్మ పాలనలో పేదలకు భూ పంపిణీ.. దొరల సంస్కృతికి కాంగ్రెస్ చరమగీతం
  • మూడెకరాల భూమి ఇస్తామని నమ్మించి మోసం చేసిన దొరల మాటలను నమ్మొద్దు
  • భూముల సర్వేను వక్రీకరించి విషప్రచారం చేస్తే సహించేది లేదు: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్:
రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల అంగుళం భూమిని కూడా ఈ ప్రజా ప్రభుత్వం లాక్కోదని, వారి భూములకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తేల్చిచెప్పారు. దళితుల భూములను లాక్కుంటున్నారంటూ కొందరు స్వార్థపరులు, దొరలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేస్తూ, ప్రభుత్వం తరఫున దళిత, గిరిజన కుటుంబాలకు స్పష్టమైన భరోసానిచ్చారు.

*పేదలకు అసలైన పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం:
సామాజిక న్యాయం, పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఊపిరి అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. చారిత్రాత్మకంగా భూ సంస్కరణలు, భూ పంపిణీ చేపట్టి భూమిలేని పేదలకు భూ హక్కులు కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని గుర్తుచేశారు. గడిచిన కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో సుమారు 25 లక్షల ఎకరాల భూములను దళితులకు పంపిణీ చేయగా, పోడు భూముల రూపంలో మరో 2 లక్షల ఎకరాలపై గిరిజనులకు సంపూర్ణ హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు.

*మోసపూరిత హామీలతో దగా చేసిన దొరల రాజ్యం
అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని నమ్మబలికి, దండుగమారి మాటలతో అధికారంలోకి వచ్చి ఆ పదేళ్ల కాలంలో ఆ హామీని నీరుగార్చిన దొరల మాటలను దళితులు ఒక్క క్షణం కూడా నమ్మవద్దని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితులను మరోసారి మోసంచేసి, వారి బలహీనతలను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

*సర్వే ప్రక్రియపై దుష్ప్రచారం మానుకోవాలి
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూముల రీ-సర్వే, రికార్డుల పరిశీలన, దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారాన్ని.. భూములు లాక్కునే చర్యలుగా చిత్రీకరిస్తూ కొందరు కిరాతకంగా విషం చిమ్ముతున్నారని మంత్రి మండిపడ్డారు. దశాబ్దాలుగా హక్కులకు నోచుకోని బడుగులకు భూ చట్టాలపై శాశ్వత హక్కులు కల్పించి, వారిని అన్నివిధాలా ఆదుకోవడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాల భూ వివాదాలను పరిష్కరించి హక్కులు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు.

*ఎలాంటి ఆందోళన అవసరం లేదు: ప్రభుత్వ భరోసా
“ఎవరో ఏదో చెప్పారని దళిత కుటుంబాలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మీ భూములను కాపాడే బాధ్యత మాది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments