- జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ నూతన లోగోలు ఖరారు!
- పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శకతే ధ్యేయంగా సరికొత్త రూపు
- సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమోదం
హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని పరిధిలో పౌర సేవలను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు నూతనంగా ఏర్పాటైన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన అధికారిక నూతన లోగోలను రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ఖరారు చేశారు. కేవలం పరిపాలనా మార్పులకే పరిమితం కాకుండా, మహానగర రూపురేఖలను సమూలంగా మార్చి సుస్థిర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక చిహ్నాలకు రూపకల్పన చేశారు.
*పరిపాలనా సౌలభ్యమే ప్రధాన అజెండా
దశాబ్దాలుగా ఒకే మహానగర పాలక సంస్థ పరిధిలో నలిగిపోయిన విస్తృత ప్రాంతాలను, పెరుగుతున్న జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. పౌర స్పందనను మెరుగుపరచడం, బాధ్యాతాయుతమైన యంత్రాంగాన్ని తీర్చిదిద్దడం ఈ నూతన కార్పొరేషన్ల ఏర్పాట్చ వెనుక ఉన్న అసలు సిసలైన శాస్త్రీయ దృక్పథం. నూతనంగా రూపుదిద్దుకున్న ఈ మూడు కార్పొరేషన్ల లోగోలు కేవలం ముద్రణాంశాలు కావు; అవి రాబోయే కాలపు మహానగర ప్రగతికి దిక్సూచులుగా నిలవనున్నాయి.
*జీహెచ్ఎంసీ: పచ్చదనం, సుస్థిరతకు ప్రతీక
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ కొత్త లోగోకు విశేష ప్రాధాన్యతనిచ్చారు.
- ఆకుపచ్చ ఆకులు: నగరంలో పచ్చదనం ఉట్టిపడేలా, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి ఇవి సంకేతం.
- నీలిరంగు నీటి బొట్టు: స్వచ్ఛమైన నీటి సరఫరా, జల వనరుల సంరక్షణ మరియు అత్యవసర పౌర సేవలందించడంలో యంత్రాంగం యొక్క నిబద్ధతను ఇది చాటుతుంది.
- హృదయాకార రూపం: నగర ప్రజల సంక్షేమం పట్ల పరిపాలనా యంత్రాంగానికి ఉండాల్సిన బాధ్యతను, ప్రజానుకూల, మానవీయ కోణంతో కూడిన సుపరిపాలనను ఇది ప్రతిబింబిస్తుంది.
*సైబరాబాద్: స్మార్ట్ మౌలిక వసతులే ధ్యేయం
ఐటీ కారిడార్‌గా, ప్రపంచ స్థాయి సంస్థల కేంద్రంగా విరాజిల్లుతున్న సైబరాబాద్ ప్రాంత ప్రత్యేకతలను ఇముడ్చుకుంటూ ఈ లోగోను శాస్త్రీయ పద్ధతిలో రూపొందించారు.
- ఆధునిక హంగులు: పచ్చని వాతావరణం చెడకుండా, హైటెక్ అభివృద్ధిని సమన్వయం చేసేలా ఆకుపచ్చని ఆకులను పొందుపరిచారు.
- పారదర్శకత: నీలం మరియు ఆకుపచ్చ రంగుల సమ్మేళనం ద్వారా పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న ఈ ప్రాంతంలో పారదర్శకమైన, పర్యావరణహిత పాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
*మల్కాజిగిరి: ప్రకృతి, ప్రజల సమ్మేళనం
అధిక జనసాంద్రత కలిగి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోగోను స్థానిక భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
- తాజా ఆకులు మరియు హృదయాకార రూపం: ప్రజల ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యత మరియు సుస్థిర భవిష్యత్తు కోసం ఈ కార్పొరేషన్ చేస్తున్న కృషికి ఇవి ప్రతీకలు.
- బాధ్యతాయుత పాలన: నీలం రంగు జోడింపు ద్వారా ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన, పారదర్శకమైన యంత్రాగాన్ని అందించాలన్న సంకల్పాన్ని బలంగా వ్యక్తపరిచారు.
*నూతన శకానికి నాంది
కేవలం కాగితాల మీద హామీలు కాకుండా, క్షేత్రస్థాయిలో పౌరులకు మెరుగైన జీవన ప్రమామాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ మున్సిపల్ సంస్కరణలు మహానగర చరిత్రలో మైలురాళ్ళుగా నిలవనున్నాయి. ఖరారైన ఈ నూతన లోగోలు త్వరలోనే అన్ని అధికారిక పత్రాలు, ప్రభుత్వ యంత్రాంగపు ఉత్తర్వులలో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. పచ్చని, పరిశుభ్రమైన, సురక్షితమైన నగరాల నిర్మాణమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని ఈ రూపకల్పనలు చాటుతున్నాయి.



