- నవాబుపేటలో ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రత్యేక ప్రచార చిత్రం ఆవిష్కరణ
- 45 రోజుల పాటు 2027 మొక్కలు నాటే మహా యజ్ఞానికి శ్రీకారం
- రెండు కోట్ల మందిని పర్యావరణ ప్రేమికులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
నవాబుపేట , మహబూబ్నగర్
నూతన సంవత్సర వేడుకలంటే కేవలం ఆడంబరాలు, విందు వినోదాలే కాదని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే బాధ్యత అని ప్రపంచ పర్యావరణ సంస్థ చాటిచెప్పింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట గ్రామంలో 2027 నూతన సంవత్సరాన్ని ప్రకృతి పరిరక్షణకు అంకితం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ప్రచార చిత్రాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ సంస్థ అంతర్జాతీయ సమన్వయకర్త, సంచాలకుడు డాక్టర్ కస్తూరి శ్రీనివాస్, సంస్థ అధ్యక్షుడు భద్ర, నవాబుపేట సర్పంచ్ గీతారాణి సుధాకర్, మండల మాజీ అధ్యక్షుడు చారి, వివిధ గ్రామాల సర్పంచులు, రెవెన్యూ మరియు మండల పరిషత్ అధికారులు, పాత్రికేయుల సమక్షంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
50 లక్షల మందికి అవగాహన.. రెండు కోట్ల మందికి చేరువయ్యేలా ప్రణాళిక
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు భద్ర మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పర్యావరణ ఉద్యమాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్ర భారత్, ఆరోగ్య భారత్ నిర్మాణమే ధ్యేయంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు, పౌరులను పర్యావరణ ప్రేమికులుగా మార్చామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందిని ఈ హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

కాలుష్య నియంత్రణకు శాస్త్రీయ దృక్పథం అవసరం
డాక్టర్ కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో పర్యావరణ చట్టాలు కఠినంగా అమలవుతున్నప్పటికీ, మన దేశంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక వ్యర్థాలు, వాయు కాలుష్యం, విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అంతర్జాతీయ పర్యావరణ నివేదికల ప్రకారం వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ, హృద్రోగ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని, భారతదేశంలోని పలు నగరాలు అత్యధిక కాలుష్య జాబితాలో ఉండటం ఆందోళనకరమని తెలిపారు. శాస్త్రీయ లెక్కల ప్రకారం, పూర్తిస్థాయిలో ఎదిగిన ఒక్క చెట్టు ఏడాదికి సుమారు 22 కిలోల బొగ్గుపులుసు వాయువును పీల్చుకుని, నలుగురు మనుషులకు సరిపడా ప్రాణవాయువును అందిస్తుందని వివరించారు. ప్రకృతిని రక్షించుకోవడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక ధర్మమని పిలుపునిచ్చారు.
నవాబుపేట చరిత్రలో నిలిచిపోయేలా 2027 మొక్కలు
గ్రామ సర్పంచ్ గీతారాణి సుధాకర్ మాట్లాడుతూ, 2027 నూతన సంవత్సరానికి గుర్తుగా గ్రామంలో 2027 మొక్కలు నాటి నవాబుపేటను ఆదర్శ హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించామని చెప్పారు. గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి పండుగగా భావించి, రాబోయే 45 రోజుల పాటు ఒక దీక్షలా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్ పాత్రలు
మండల వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు, జీకే సేవా సంస్థ సంచాలకుడు జీకే సుధాకర్ మాట్లాడుతూ, పర్యావరణ ఉద్యమానికి వ్యాపార వర్గాల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్లాస్టిక్ మరియు కాగితపు ప్లేట్ల వాడకాన్ని అరికట్టేందుకు తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఏడాది కాలంగా స్టీల్ ప్లేట్లనే వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ విధానాన్ని జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి కోనేటి, కోశాధికారి రిజ్వాన్ అహ్మద్ సాగర్, కార్యక్రమ సమన్వయకర్త కొలిపాక రంజిత్, సామాజిక మాధ్యమ సమన్వయకర్త అజయ్ రెడ్డి, శివ, భరత్, ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. 2027 నూతన సంవత్సరాన్ని వేడుకలతో పాటు ప్రకృతికి ఇచ్చే పచ్చని కానుకతో ప్రారంభిద్దామని, భూతాపాన్ని తగ్గించి భావితరాలకు సురక్షితమైన భూమిని అందిద్దామని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు.


